బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్‌లో ముసలం..సీనియర్లు అలక
వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కొందరు కాంగ్రెస్ సీనియర్లకు అలక తెప్పిస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. తనకు చెప్పకుండా సంజయ్‌ను పార్టీలోకి ఆహ్వానించడంపై మండిపడుతున్నారు. తనకు ప్రత్యర్థిగా 2014 నుండి మూడుసార్లు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న సంజయ్‌ను తనకు తెలియకుండా పార్టీలో చేర్చుకోవడం ఆయనకు మనస్తాపం కలిగించింది. తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సంగతి తెలిసి, ఆయనను బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు కొందరు నేతలు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరినట్లు సమాచారం. తాను 40 ఏళ్లుగా గౌరవ రాజకీయాలు చేశానని, ఇక పార్టీకి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు జీవన్ రెడ్డి. వ్యవసాయం చేసుకుంటే మేలని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని సమాచారం.