రాజకీయాలలో గెలుపోటములు సహజం..ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తాం-కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రభుత్వాన్ని నడపమని అవకాశం ఇచ్చారని, రాజకీయాలలో గెలుపోటములు సహజమని మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. అధికారంలోనే కాకుండా ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థవంతంగా పోషిస్తామని ఆయన పేర్కొన్నారు. స్వల్పతేడాతోనే తమ అభ్యర్థులు 10 నుండి 12 సీట్లు కోల్పోయామని తెలియజేశారు. ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, తమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 40 స్థానాలు తమ పార్టీ సాధించిందని, ప్రజలకు, కార్యకర్తలకు తమ కృతజ్ఞతలని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు ప్రజల తీర్పును గౌరవించి, తన రాజీనామాను గవర్నర్‌కు పంపారని తెలియజేశారు. తెలంగాణ ప్రజల హృదయాలలో బీఆర్‌ఎస్ పార్టీ ఉందని, పార్టీ కేడర్ కుంగిపోకుండా, ఓటమిపై రివ్యూ చేద్దామన్నారు. రెండుసార్లు తమ పార్టీకి అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తమ సహకారం నూతన ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

