షర్మిలను అరెస్టు చేస్తారా..?.. ఆమెపై కుట్ర జరుగుతోందా..?
‘వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారు. నన్నూ చంపాలని చూస్తున్నారు’ అంటూ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలతో సంచలనం సృష్టించారు. షర్మిలను చంపేందుకు నిజంగానే కుట్ర జరుగుతోందా..? ఎవరు కుట్ర చేస్తున్నారు..? ఆమెను చంపేంత కోపం ఎవరికి ఉంది..? షర్మిల, తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం, పరస్పర ఫిర్యాదులను ఓసారి పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

మంగళవారం మరదలు బయల్దేరింది..
ఐదు నెలలుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌పై, పలువురు మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్లకు పైగా పూర్తయింది. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న పాతయాత్ర సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డికి, షర్మిలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది పరస్పర ఫిర్యాదుల వరకూ వెళ్లింది. పాదయాత్ర సందర్భంగా షర్మిల నిరుద్యోగులకు మద్దతుగా ప్రతి మంగళవారం ‘నిరుద్యోగ దీక్ష’ చేస్తున్నారు. దీనిపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. ‘మంగళవారం మరదలు బయల్దేరింది’ అని టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో షర్మిలను ఎద్దేవా చేశారు.

కుక్కకు, నీకు తేడా లేదు
నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన షర్మిల ‘ఎవడ్రా నీకు మరదలు’ అని ప్రశ్నించారు. ‘అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మెట్టు దెబ్బలు పడతాయ్.. మేం చేస్తున్న పోరాటంలో నీకు మరదలు కనిపించిందా..? సిగ్గుండాలి. వీధి కుక్కకు.. నీకు తేడా లేదు’ అంటూ రెచ్చిపోయారు. పరాయి స్త్రీలలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడిగా మంత్రి నిరంజన్‌ను ఏకిపారేశారు. వ్యవసాయ మంత్రిగా ఉంటూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేని దద్దమ్మ అంటూ మండిపడ్డారు. ఒకప్పుడు ఆస్తులేమీ లేని నిరంజన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు.

షర్మిలపై ఎమ్మెల్యేల ఫిర్యాదు..
దీంతో షర్మిలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య ఫిర్యాదు చేశారు. చట్టసభల ప్రతినిధులమైన తమను వైఎస్ షర్మిల నోటికొచ్చినట్లు తిడుతున్నారని.. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఈ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని స్పీకర్ అన్నారు. దీనిపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిలపై చర్యలకు ఆదేశిస్తుందో చూడాలి. డీజీపీకి కూడా మంత్రి నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

బేడీలకు బెదిరేది లేదు..
నిరంజన్ రెడ్డి ఫిర్యాదుతో వైఎస్ షర్మిలను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో తనను అరెస్టు చేసి చంపేందుకు కుట్ర పన్నుతున్నారని షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా కుట్ర చేసి చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బేడీలకు భయపడేది లేదని, తనను అరెస్టు చేసి తన పాదయాత్రను ఆపేందుకు కుట్ర పన్నుతున్నారని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్ కూడా విసిరారు. తాను పులి బిడ్డనని, బేడీలకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. తనను మరదలు అని అవమానించిన మంత్రి నిరంజన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని విమర్శించారు. పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. షర్మిల, నిరంజన్ రెడ్డిల మధ్య ఈ మాటల యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

