8 సీట్లతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారా..?
లోక్‌సభలో టీఆర్‌ఎస్‌కు 8 సీట్లే ఉన్నాయని.. ఆ సీట్లతో కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం ఎలా తిప్పుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీని బలోపేతం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రజల్లోనే వ్యతిరేకత పెరుగుతోందని.. ఇక జాతీయ స్థాయిలో ఎవరు ఆదరిస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చను తప్పుదోవ పట్టించేందుకే జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ హంగామా చేస్తున్నారని ఆరోపించారు. కల్వకుంట్ర కుటుంబ సభ్యులకు నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులే కనిపిస్తున్నారని.. కేసీఆర్ మాత్రం ఫాం హౌస్‌లో కూర్చొని పగటి కలలు కంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.

బీజేపీ గెలిస్తేనే మునుగోడు అభివృద్ధి..
మునుగోడు అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్లే ఇటీవల అక్కడ అభివృద్ధి పనులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పాలనకు రిఫరెండం అయిన ఈ ఉప ఎన్నికలో బీజేపీ మంచి మెజారిటీతో గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల తర్వాత కల్వకుంట్ర కుటుంబం అంధకారంలోకి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అయితే.. ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి కుట్ర చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.