దొంగ దొరికితే సెటిల్‌మెంట్ చేస్తారా?
శ్రీవారి పరకామణి దొంగతనం ఘటనపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆధారాలతోనే తాము మాట్లాడుతున్నామని స్పష్టం చేస్తూ, ఈ కేసులో వైసీపీ నేతలు, ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాత్రపై ఆయన మండిపడ్డారు.భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రవికుమార్ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరతామని తెలిపారు. రవికుమార్ దొంగతనంలో పట్టుబడినప్పటికీ, ఆ కేసు రాజీ చేసుకున్నది భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న సమయంలోనేనని గుర్తుచేశారు. “దొంగ దొరికితే సెటిల్‌మెంట్ చేస్తారా? దొంగలు దొంగతనం చేసి జగన్, కరుణాకర్ దగ్గరకు వెళ్తే రాజీ చేస్తారా?” అని ఆయన నిలదీశారు.ఇప్పుడు కరుణాకర్ రెడ్డి “తనకేం తెలియదు” అన్నట్లుగా ప్రవర్తించడం డ్రామా తప్ప మరేమీ కాదని భాను ప్రకాష్ విమర్శించారు. దొంగతనం కేసులో రాజీ రూ.40 కోట్లకా లేక రూ.400 కోట్లకు జరిగిందో తాము బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. శ్రీవారి ఆస్తులను కాపాడినట్టయితే, అప్పుడు కరుణాకర్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి నిజాలను బయటపెట్టలేదని ప్రశ్నించారు. అదే విధంగా, దొంగ దొరికిన తరువాత లోక్ అదాలత్‌లో సెటిల్‌మెంట్ ఎలా జరిగిందని భాను ప్రకాష్ నిలదీశారు. మరో రెండు రోజుల్లో ఈ పరకామణి దొంగతనానికి సంబంధించిన సంచలన విషయాలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు. “స్వామి వారికంటే మనం గొప్పవాళ్లమా?” అని ప్రశ్నిస్తూ, ఈ వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి అండ్ కో జైలుకెళ్లడం ఖాయమని సెటైర్లు గుప్పించారు. అంతేకాకుండా, స్విమ్స్ మెడికల్ షాపుల్లో కూడా అవినీతికి పాల్పడి శ్రీవారి నిధులను దోచుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని, ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేసినా నిజాలు బయటపడతాయని భాను ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరకామణి దొంగతనం కేసు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలపై భూమన కరుణాకర్ రెడ్డి ఏం స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.