Home Page SliderTelangana

స్వతంత్ర అభ్యర్థిగా పాలేరులో తుమ్మల పోటీ చేస్తారా?

తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావుకు ఒక విశిష్టమైన పేరు ఉంది. ఆయన రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ సాగుతుంటారు. ఎప్పుడు కూడా దుందుడుకు వ్యవహార శైలి ఆయనలో కనిపించేది కాదు. రాజకీయం అంటే రాజకీయం, మిగతా వ్యవహారాలు మరోలా అన్నట్టుగా ఆయన వ్యవహరించేవారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమయ్యింది. ఇక తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవితవ్యం ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే ఆయనకు అనూహ్యంగా కేసీఆర్ నుంచి కబురొచ్చింది. అనుకోకుండా తెలంగాణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్సీగా చేసిన కేసిఆర్ ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికలోనూ బరిలో దిగేందుకు అవకాశం ఇచ్చి, తగిన గౌరవం ఇచ్చారు. వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావు గులాబీ పార్టీలో మంచి గుర్తింపు పొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రావడం, కమ్మ సామాజికవర్గం నాయకుడిగా తనకున్న క్యాలిబర్, గులాబీ పార్టీకి నాడు పెద్ద ఎత్తున ఉపకరించింది. ఆ వర్గం ఎక్కువగా గులాబీ పార్టీ వైపు టర్న్ కావడంలో తుమ్మల పాత్ర కూడా విశేషమైనది.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో తుమ్మల ఓడిపోవడంతో ఆయనకు రాజకీయంగా గ్రహణం పట్టినట్లు అయింది. వాస్తవానికి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావుకు సమచిత స్థానం ఇస్తారని అందరూ భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ విజయ సాధించినప్పటికీ, ఖమ్మం జిల్లాలో కారు పార్టీ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తుమ్మల లాంటి నాయకులు సైతం అనుహ్యాంగా ఓటమి పాలయ్యారు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకున్నా, తుమ్మలకు తగిన హోదా ఇచ్చి గౌరవిస్తారని అనుకున్నారు. కానీ కేసీఆర్, తుమ్మలను కాదని ఖమ్మం నుంచి గెలిచిన పువ్వాడ అజయ్‌ను క్యాబినెట్లోకి తీసుకోవడంతో, ఆయన రాజకీయం మరో టర్న్ తీసుకుంది. 2018 ఎన్నికల్లో ఆరుగురు కమ్మ నాయకులకు టికెట్లు కేటాయించిన కేసీఆర్ ఆ వర్గంపై ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ కొన్ని ప్రాంతాల్లో ఆ వర్గం ఓట్లు కారు గుర్తుకు పడతాయన్న భావన కూడా గతంలో వ్యక్తం అయింది. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా… బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అన్న నానుడి మరోసారి రుజవయ్యింది.

పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు ఓడించిన కాందాళ ఉపేందర్ రెడ్డికి మరోసారి గులాబీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో, ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న తుమ్మల ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై తర్జనభర్జనకు గురవుతున్నారు. ఇన్ని అవమానాలతో ఇంకెంత కాలం గులాబీ పార్టీలో ఉంటారంటూ అనుచరులు ఇప్పుడు తుమ్మలను ప్రశ్నిస్తున్నారు. పార్టీ మారాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్ ఇంతలా అవమానించినప్పటికీ ఇంకా గులాబీ పార్టీలో ఉంటే, అది ఆత్మహత్య సదృశ్యమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తుమ్మలను రారమ్మని, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు ఓపెన్ ఆఫర్లుస్తున్నాయి. అయితే ఇటీవల ఖమ్మం జిల్లాలో ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత, తుమ్మల నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందనిపిస్తోంది.

కమ్యూనిస్టులకు కంచుకోటలా ఉన్న జిల్లాలో తుమ్మల బీజేపీలో చేరి, రాణించడం కష్టమన్న భావన ఉంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారైనందున, బీజేపీ నుంచి సైతం పోటీ చేసినా తుమ్మల గెలుస్తారన్న దీమాను ఆయన అభిమానులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఏవిధంగా రాజకీయం చేస్తారన్నది సర్వత్ర ఆసక్తి కలిగిస్తోంది. తుమ్మల ఏదైనా పార్టీలో చేరతారా లేదంటే, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్నది చూడాల్సి ఉంది. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని తుమ్మల చూస్తూ ఊరుకోరని మాత్రం తెలుస్తోంది. ఓవైపు అనుచరులు, మరోవైపు సన్నిహితులు ఆయనను ఎన్నికల గోదాలోకి లాగడం ఖాయమనిపిస్తోంది.