ఎమర్జెన్సీ సినిమాకి మోక్షం ఎప్పటికి కలిగేనో…
బాలీవుడ్ క్వీన్, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ‘ఎమర్జెన్సీ’ సినిమా మరోసారి వాయిదా… దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటించిన విషయం ఇదివరలో మీకు తెలిసిందే. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడుతూ వస్తోంది. ఆ తర్వాత కూడా ఈ సినిమా హాళ్లవరకు వెళ్లలేదు. చివరికి ఈ నెల 6న (శుక్రవారం) విడుదల చేయనున్నట్లు కంగన ప్రకటించారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు కంగన శుక్రవారం ఉదయం ఎక్స్ వేదికగా ప్రకటించారు. సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాలేదని తెలిపారు. దాని కోసమే వెయిటింగ్ అని చెప్పారు. త్వరలో ఏ డేట్‌లో రిలీజ్ ఉంటుందో కన్‌ఫర్మ్‌గా చెబుతామన్నారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1972లో విధించిన ఎమర్జెన్సీ కాలంనాటి రాజకీయ పరిణామాల గురించి ఈ సినిమాలో వివరించారు. అయితే, సిక్కు మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ఆరోపణలు. అకాల్ తఖ్త్ సాహిబ్‌పై బాంబు దాడి, ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ టైంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను మళ్లీ గుర్తు చేస్తూ.. కథను పూర్తిగా వన్‌సైడే చూపించారన్న ఆరోపణలతో ఎమర్జెన్సీని కొన్నివర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఈ కారణాలతో ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇప్పటి వరకూ సర్టిఫికెట్ ఇవ్వలేదు. అందుకే తిరిగి వాయిదా పడింది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే పోషించారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

