కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు జరుగుతాయా?
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత సామరస్యం దెబ్బతింటుందని, మత కల్లోలాలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎలా చెప్తారంటూ ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. హోం మంత్రి అమిత్ షాతోపాటుగా బీజేపీ కర్నాటక నేతలపై బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించారని, ప్రతిపక్షాలను దూషించారని ఆరోపిస్తూ… పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అన్నారని.. ఆయన ఆ మాటలు ఎలా చెబుతారని వారు ప్రశ్నించారు.

షా వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. ఏప్రిల్ 25వ తేదీన కర్ణాటకలోని విజయపుర, ఇతర ప్రాంతాల్లో జరిగిన ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అమిత్ షా ప్రసంగంలో తప్పుడు నిరాధారమైన ఆరోపణలను చేశారని, భారత జాతీయ కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని, తప్పుడు ప్రకటనల కారణంగా తాము దిగ్భ్రాంతికి గురయ్యామని, ప్రశాంతంగా ఉన్న కర్నాటకలో మతసామరస్య దెబ్బతీసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఐపీసీలోని 153, 505 (2), 171జి, 120బి వంటి సెక్షన్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా అమిత్ షా బ్యాక్ టు బ్యాక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
