Home Page SliderInternational

భారత్, బంగ్లా టెస్ట్ సిరీస్‌లో 5 రికార్డులను స్టార్ బౌలర్ చెరిపేస్తాడా?

భారత్, బంగ్లా సీరిస్‌లో అశ్విన్ రికార్డుల మోత మోగించేనా?
కొంచెం బెటర్‌గా ఆడితే 5 రికార్డులు బద్ధలుకొట్టే ఛాన్స్

ఇండియా మేటి స్పిన్నర్లలో అనిల్ కుంబ్లే తర్వాత అంతటి స్థాయి ఒక్క రవిచంద్రన్ అశ్విన్‌కు మాత్రమే లభించింది. అటు టెస్టులు, ఇటు వన్డేల్లో సత్తా చాటుతున్న అశ్విన్ బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల్లో రాణిస్తే, ఆయన పేరున మరో 5 రికార్డులు సరికొత్తగా సృష్టించే అవకాశం ఉంది. టీమిండియా స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్ కీలక ఆటగాడిగా గుర్తింపు పొందాడు. బంగ్లాదేశ్‌తో జరిగే 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ అశ్విన్ రికార్డులకు వేదికవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన అశ్విన్ తాజాగా మరికొన్ని రికార్డులను వశం చేసుకోవాలని భావిస్తున్నాడు. స్వదేశంలో జరిగే టెస్టుల్లో అశ్విన్ కంటే రాణించేవారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. బంగ్లాదేశ్‌పై జరుగుతున్న టెస్టుల్లో సత్తా చాటి అశ్విన్ మరిన్ని రికార్డులు బద్ధలుకొట్టాలని చూస్తున్నాడు.

భారత్‌లో అత్యధిక వికెట్లు: రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున టెస్టుల్లో ఆల్ టైమ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లేను అధిగమించడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ, స్వదేశంలో ఆడిన టెస్టుల విషయానికి వస్తే, సొంతగడ్డపై ఆడిన మ్యాచ్‌ల్లో అనిల్ కుంబ్లే 476 అంతర్జాతీయ వికెట్ల రికార్డును బద్దలు కొట్టడానికి అశ్విన్ కేవలం 22 వికెట్లు మాత్రమే దూరంగా ఉన్నాడు.

భారత్ vs బంగ్లాదేశ్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు: అశ్విన్ బంగ్లాదేశ్‌తో ఆడిన 6 టెస్ట్ మ్యాచ్‌లలో 23 వికెట్లు పడగొట్టాడు. మరో 9 వికెట్ల పడగొడితే, అశ్విన్ దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌ను అధిగమించనున్నాడు. ప్రస్తుతం జహీర్ 31 వికెట్లతో రికార్డు సృష్టించాడు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సార్లు 5 వికెట్లు: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో అశ్విన్ ఇప్పటికే పదిసార్లు 5-వికెట్ల పడగొట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియాన్‌తో సమానంగా అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో మరోసారి ఐదు వికెట్లు పడగొడితే ఆ సంఖ్య 11కు చేరుకుంటుంది. అప్పుడు కొత్త రికార్డు సృష్టించినట్టవుతుంది.

WTC చరిత్రలో అత్యధిక వికెట్లు: ఈ రికార్డులతోపాటుగా ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలోనూ అశ్విన్ అగ్రస్థానాన్ని పొందగలుగుతాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో నాథన్ లియాన్ 187 వికెట్లు తీసిన రికార్డుకు అశ్విన్ కేవలం 14 వికెట్లు దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో భారత్ 2 టెస్టులు ఆడనున్నందున, అశ్విన్ లియాన్‌ను దాటే అవకాశం ఉంది.

WTC క్యాంపెయిన్‌లో అత్యధిక వికెట్లు: ప్రస్తుతం, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ WTC 2023-25లో 51 వికెట్లతో టాప్ స్పాట్‌లో నిలిచాడు. హాజిల్‌వుడ్‌ను అధిగమించేందుకు అశ్విన్‌కు ప్రస్తుతం 10 వికెట్లు కూల్చితే సరిపోతుంది.