వామపక్షాలు మళ్లీ ‘కరివేపాకు’ చందమేనా..?
సీఎం కేసీఆర్ జిత్తుల మారి అని మరోసారి నిరూపించుకున్నారు. అవసరమైనప్పుడు ఎవరిని దగ్గరికి తీసుకోవాలో.. అవసరం తీరగానే ఎవరిని దూరం పెట్టాలో.. కేసీఆర్‌కు తెలిసినంతగా రాష్ట్ర రాజకీయ నాయకుల్లో మరెవరికీ తెలియదని ప్రత్యర్థి పార్టీల నాయకులే అంగీకరిస్తారు. ఇలాంటి అపర చాణక్యుడు మరోసారి తన రాజనీతిని ప్రదర్శించుకున్నారు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టుల ఓట్లు కీలకమైన తరుణంలో వామపక్ష నాయకులను అక్కున చేర్చుకున్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించగానే కూరల్లో నుంచి కరివేపాకును తీసి పడేసినట్లు వామపక్ష నాయకులను పక్కన పెట్టేశారు. కేసీఆర్ అండతో ఈ సారి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న కమ్యూనిస్టుల ఆశలను ఒక్క ప్రకటనతో వమ్ము చేసేశారు.

టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరేనా..?
ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానన్న సీఎం కేసీఆర్ ప్రకటన టీఆర్‌ఎస్‌లోనూ.. ఇతర పార్టీల్లోనూ గందరగోళానికి కారణమైంది. ముఖ్యంగా వామపక్షాలతో కలిసి దేశవ్యాప్తంగా బీజేపీపై రాజకీయ పోరాటం చేస్తానని మునుగోడు సాక్షిగా ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు వామపక్షాలు ఎవరు..? అనే పరిస్థితిని కల్పించారు. ఎందుకంటే.. మునుగోడు సహా టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న పలు నియోజక వర్గాల్లో సీపీఐ, సీపీఎంలకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కనీసం 20 సీట్లు అయినా తమకు కేసీఆర్ కేటాయిస్తారని ఆశించిన వామపక్ష నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వకున్నా టీఆర్‌ఎస్‌తో కలిసి ముందుకెళ్లాలా.. విడిపోవాలా.. అనే తర్జనభర్జనలో కమ్యూనిస్టు నాయకులు పడ్డారు.

తోక పార్టీలుగా ఉన్నంత కాలం ఇంతే..
నిజానికి.. సొంత బలం పెంచుకోకుండా కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా.. టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చినా.. ఇంకే పార్టీకి మద్దతిచ్చినా.. ఎన్నికల తర్వాత వామపక్షాల పరిస్థితి ‘కరివేపాకు’ చందంగా మారుతుందనడంలో సందేహం లేదు. ప్రాంతీయ పార్టీకి అయినా.. జాతీయ పార్టీకి అయినా తోక పార్టీగా ఉన్నంత కాలం ‘ఎర్ర జెండా’ పార్టీలను, ఆ పార్టీల నాయకులను భగవంతుడు కూడా కాపాడలేడని రాజకీయ పండితులు అంటున్నారు.