NationalNews

రాజస్థాన్‌ కూడా కాంగ్రెస్‌ చేజారిపోనుందా..?

అశోక్‌ గెహ్లాట్‌ వర్గం తిరుగుబావుటా

సచిన్‌ పైలట్‌ను సీఎం చేయొద్దని పట్టు

గెహ్లాట్‌ అనుచరుడినే సీఎం చేయాలని బెట్టు

లేకుంటే రాజీనామా చేస్తామని బెదిరింపు

కాంగ్రెస్‌ చేతి నుంచి మరో రాష్ట్రం జారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు అప్పగించి సచిన్ పైలట్‌ను రాజస్థాన్‌ ముఖ్యమంత్రిని చేయాలన్న పార్టీ అధిష్ఠానం నిర్ణయం బెడిసి కొట్టింది. రాజస్థాన్‌లో సీఎంగా అశోక్‌ గెహ్లాట్‌నే కొనసాగించాలని.. లేకుంటే ఆయన వారసుడిగా గెహ్లాట్‌ అనుచరుడికే సీఎం పగ్గాలు అప్పజెప్పాలంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తమ మాట వినకుండా సచిన్‌ పైలట్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెడితే రాజీనామా చేస్తామని ఏకంగా 92 మంది ఎమ్మెల్యేలు బెదిరించారు.

నా చేతిలో ఏమీ లేదు: గెహ్లాట్‌

నిజానికి కొత్త సీఎంను ఎన్నుకునేందుకు ఆదివారం ముఖ్యమంత్రి నివాసంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా వచ్చిన మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌ ఎంతసేపు ఎదురు చూసినా 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. తమతో విడివిడిగా మాట్లాడాలని కోరినా ఇతర ఎమ్మెల్యేలు రాలేదు. ఇదేంటని అడిగిన అధిష్ఠానానికి.. తన చేతిలో ఏమీ లేదని గెహ్లాట్‌ స్పష్టం చేశారు. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఉందని ఆయన చెప్పారు. అదే సందర్భంలో కొత్త మంత్రివర్గంలో గెహ్లాట్‌ ప్రాధాన్యం తగ్గకూడదని ఆయన వర్గీయులు పట్టుదలతో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి గెహ్లాట్‌ వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషికి లేదా పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దొటాస్రాకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

గెహ్లాట్‌, పైలట్‌కు అధిష్ఠానం పిలుపు

సీఎల్పీ సమావేశానికి ముందే గెహ్లాట్‌ వర్గం మంత్రి శాంతి ధారీవాల్‌ నివాసంలో విడిగా సమావేశమైంది. గెహ్లాట్‌నే సీఎంగా కొనసాగించాలని.. లేకుంటే 2020లో సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు చేసినప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అండగా నిలిచిన వారిలో ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని వీరు తీర్మానించారు. అలా జరగకుంటే రాజీనామా చేస్తామంటూ ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను స్పీకర్‌ సీపీ జోషికి సైతం ఇచ్చారని తెలుస్తోంది. గోవింద్‌ సింగ్‌ దొటాస్రా కూడా పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేశారు. సంక్లిష్ట పరిస్థితి తలెత్తడంతో మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌ ఢిల్లీ వెళ్లిపోయారు. షాక్‌కు గురైన పార్టీ అధిష్ఠానం పరిస్థితి చేయిదాటి పోతుందన్న భయంతో అశోక్‌ గెహ్లాట్‌ను, సచిన్‌ పైలట్‌ను ఢిల్లీకి పిలిపించింది.