బీజేపీపై రాహుల్ గాంధీ వినేశ్‌ను ప్రయోగిస్తారా..?
పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ తృటిలో చేజారిన తర్వాత వినేష్ ఫొగట్‌కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఆమెను స్వర్ణపతక విజేత కంటే ఘనంగా సత్కరించారు. దీనితో ఈ సెలబ్రిటీ స్టేటస్‌ను బీజేపీపై అస్త్రంగా ఎక్కుపెట్టారు రాహుల్ గాంధీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో వినేష్, భజరంగ్ పునియా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ రాహుల్ గాంధీని కలుసుకోవడం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. కాంగ్రెస్ నేత బీరేంద్రసింగ్ కూడా వినేష్‌పై పొగడ్తలతో ముంచెత్తారు. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. వీరిలో భజరంగ్ పునియా పోటీ చేయడానికి ఆసక్తి చూపించలేదని, కానీ ఆయనకు పార్టీ పదవి ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా వినేష్, భజరంగ్ పునియాలు రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ ఛైర్మన్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా వీరు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనకు కాంగ్రెస్ నేతలు మద్దతు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ మద్దతిస్తున్న రైతుల ఆందోళనకు కూడా వినేష్ మద్దతు ప్రకటించారు. దీనితో ఆమె కాంగ్రెస్ తరపున ఎన్నికలలో పోటీ చేయడమో లేదా ప్రచారంలో పాల్గొనడమో ఖచ్చితంగా జరగవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.