హుస్నాబాద్‌లో పొన్నం గేమ్ చేంజర్ అవుతారా?
కమ్యూనిస్టుల కంచుకోటగా హుస్నాబాద్‌కు పేరుంది. నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర్నుంచి పాత ఇందుర్తిలోనూ కమ్యూనిస్టులు ఇక్కడ చెరగని ముద్రవేశారు. సుదీర్ఘకాలంగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న హుస్నాబాద్‌లో 2014, 2018 ఎన్నికల్లో కెప్టెన్ లక్ష్మీ కాంతరావు తనయుడు వొడితెల సతీష్ కుమార్ విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ముఖ్యనేత చాడ వెంకట్ రెడ్డిని సతీష్ భారీ తేడాతో ఓడించారు. 2009లో ఈ నియోజకవర్గం రూపు మార్చుకొంది. అంతకు ముందు ఇందుర్తి నియోజకవర్గంలో సీపీఐ హవా నడిచింది. 1999లో బొమ్మా వెంకటేశ్వర్ ఇక్కడ్నుంచి విజయం సాధించగా… ఇక్కడనుంచి సీపీఐ నేత దేశిని చినమల్లయ్య హాట్రిక్ విజయాలు సాధించారు. తాజా ఎన్నికల్లో హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బరిలో దిగారు. మున్నురు కాపు సామాజికవర్గానికి చెందిన ఆయన ఇక్కడ్నుంచి విజయం ఖాయమంటున్నారు. మరోవైపు హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి సైతం గట్టి పోటీ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రభావం చూపుతున్న శ్రీరాం చక్రవర్తి అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులకు కంటి మీద కనుకులేకుండా చేస్తోంది.

హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం పోలింగ్ బూత్‌లు 304 కాగా పురుష ఓటర్లు 1,17,165 ఉన్నారు. మహిళా ఓటర్లు1,19,406 మంది ఉన్నారు. నలుగురు ట్రాన్స్ జెండర్లు ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లు 2,36,575 ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మున్నూరుకాపులు 15 శాతం వరకు ఉండగా, ముస్లింలు సైతం 11 శాతం మేర ఉన్నారు. పద్మశాలీలు తొమ్మిదిన్నర శాతం, మాదిగలు 9 శాతం మేర ఉన్నారు. గొల్లలు ఎనిమిదిన్నర శాతం ఉండగా, ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా వైశ్యులు సుమారుగా ఏడున్నర నుంచి ఎనిమిది శాతం వరకు ఉన్నారు. మాలలు సైతం సుమారుగా 7 శాతానికి చేరువగా ఉన్నారు. గౌడ సామాజికవర్గం ఆరున్నర శాతం ఉండగా, రెడ్లు 5-6 శాతం మధ్య ఉన్నారు. మున్నూరు కాపులు సైతం ఇక్కడ సుమారుగా 4 శాతానికి చేరువగా ఉన్నారు. లంబాడాలు మూడు శాతానికి పైగా ఉండగా ఇతరులు 13-15 శాతం మధ్య ఉన్నారు.

