దేశ రాజకీయాల్లో కేసీఆర్ సక్సెస్ అవుతారా?
తెలంగాణ రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా నిలిచిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా..? ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో ఖ్యాతి గడించిన కేసీఆర్‌ను జాతీయ నాయకుడిగా ఇతర రాష్ట్రాల ప్రజలు అంగీకరిస్తారా..? జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేయడం వెనుక ఆయన లక్ష్యం ఏంటి..? ప్రధాని పదవిపైనే కన్నేశారా..? లేకుంటే.. రాష్ట్రాన్ని కుమారుడు కేటీఆర్‌కు అప్పగించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారా..?

కవితకు కేంద్ర మంత్రి పదవికి విఫల యత్నం..
నిజానికి.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కన్ను 2019లోనే పడింది. తెలంగాణాలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కూతురు కవితకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించాలని చాలా ప్రయత్నాంచారు. అయితే.. బీజేపీకి టీఆర్‌ఎస్ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఎన్డీయేలో భాగస్వామి కాకపోవడంతో ఆ ఆశ నెరవేరలేదు. ప్రధాని మోదీ కూడా కేసీఆర్ ప్రయత్నాలకు సానుకూలంగా స్పందించలేదు. అప్పటి నుంచే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశం కోసం కేసీఆర్ ఎదురు చూస్తున్నారు.

బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడలేని కాంగ్రెస్..
ఇప్పుడు దేశ రాజకీయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ భావిస్తున్నారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, వ్యవసాయానికి గిట్టుబాటు ధర లభించకపోవడం, మోదీ పదేళ్ల సుదీర్ఘ పాలనలో బడా కార్పొరేట్ వర్గాల పక్షం వహిస్తూ.. పేదలను పట్టించుకోవడం లేదనే విమర్శలు.. తదితర కారణాల రీత్యా దేశ ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని కేసీఆర్ నమ్ముతున్నారు. అదే సందర్భంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని భావిస్తున్నారు. అందుకే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రజలు పట్టం కడుతున్నారు. అదే సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం మోదీకే ఓటేస్తున్నారు.

రానున్న కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్రకు స్కెచ్..
ఇలాంటి పరిస్థితిలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్‌కు మెజారిటీ రాదని కేసీఆర్ ఆశాభావంతో ఉన్నారు. ఆ సమయంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం అవుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణాతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ స్థానాలున్నందున టీఆర్‌ఎస్‌తో జాతీయ స్థాయిలో ప్రభావం చూపడం కష్టమనే భావన కేసీఆర్‌లో ఉంది. అందుకే.. జాతీయ పార్టీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులో భాగంగా సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించాలని.. తద్వారా రాబోయే కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించాలని కేసీఆర్ స్కెచ్ గీశారు.

బీజేపీ బెదిరింపులకు చెక్ పెట్టాలంటే..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం సాధించినా.. కాంగ్రెస్ ఆధిక్యం సాధించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు తన మద్దతు కోసం బేరాలాడాలంటే ఎక్కువ సీట్లు సాధించాలని కేసీఆర్‌కు తెలుసు. అప్పుడు కేంద్ర మంత్రి వర్గంలోనూ సాధ్యమైనంత ఎక్కువ వాటా పొందొచ్చని ఆశిస్తున్నారు. పరిస్థితి అనుకూలించి ప్రాంతీయ పార్టీల కూటమే అధికారం చేపట్టే స్థాయికి చేరుకుంటే ప్రధాని లేదా ఉప ప్రధాని వంటి కీలక పదవులూ చేపట్టొచ్చని కేసీఆర్ ఆశతో ఉన్నారు. మరోవైపు అక్రమాలు, అవినీతి అంటూ.. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులంటూ.. తమ కుటుంబాన్ని, టీఆర్‌ఎస్ నాయకులను బీజేపీ నేతలు భయపెడుతున్నారు. ఈ బెదిరింపులకు చెక్ పెట్టాలంటే.. జాతీయ స్థాయిలో ఉనికి చాటక తప్పదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.