Home Page SliderTelangana

జనసేనకు కూకట్‎పల్లి కమ్మ సామాజికవర్గం మద్దతు లభిస్తుందా?

పొత్తులు గమ్మత్తులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నో విచిత్రాలు, మరెన్నో ఆసక్తికరమైన సన్నివేశాలు నమోదవుతున్నాయ్. అసలు రాజకీయాలు ఇలా ఉంటాయా అన్న అనుమానం కలగుతోంది. గత కొద్దిరోజులుగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో విజయం కోసం అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచితీరాలన్న పంతంతో ఉన్న బీజేపీ అందుకు తగినట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఐతే బీజేపీ ఈ ఎన్నికల సందర్భంగా అనుసరించిన ఆలోచన లేదంటే వ్యూహం కొత్త విషయాలను ఏపీ, తెలంగాణ ప్రజల ముందుకు తెస్తున్నాయి. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని సాహసమే చేసిందని చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి తెలంగాణలో అంత సీన్ లేదన్న భావనతో సైకిల్ పార్టీ చేతులెత్తేసింది. ఈ తరుణంలో బీజేపీ, జనసేనతో పొత్తు కావాలంటూ వెళ్లి మరీ కోరుకుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో ప్రచారం చేయిస్తే లాభం కలుగుతుందేమోనన్న ఆశలో బీజేపీ పెద్దలున్నారు. ప్రధాని మోదీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌ను చూపించి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులకు ఊపు తీసుకురావాలన్న ఆలోచన ఉంటే ఉండొచ్చు. కానీ అది ఎంత మేరకు ఫలితాన్నిస్తుందనేది చూడాలి.

గులాబీ పార్టీ విజయం కోసం అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఈసారి విజయం సాధించకపోతే ఇక భవిష్యత్ కష్టమన్న భావనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ… ఎన్నికల వ్యూహాలను పన్నుతోంది. ఇప్పటికి కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారుతోంది. కనీసం 61 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్న కాషాయ దళం, జనసేనతో పొత్తు తెలంగాణలో కాపు సామాజికవర్గం ఓట్లను తమవైపునకు తిప్పుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. కానీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి లాభమా? నష్టమా? అన్న చర్చ కూడా సాగుతోంది. తెలంగాణలో కార్యకర్తల బలంతో పటిష్టంగా ఉన్నామని చెప్పుకునే టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకోవడంతో పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ చేతులెత్తేయగా, జనసేన మాత్రం బరిలో దిగుతోంది. జనసేనకు పొత్తులో భాగంగా 8 స్థానాలు కేటాయించింది. వాస్తవానికి 22 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన డిసైడయ్యింది. కానీ బీజేపీ హైకమాండ్ పవన్ కల్యాణ్‌ను 8 సీట్లకు ఒప్పించింది.

బీజేపీ పరిస్థితి క్లిష్టంగా మారుతున్న తరుణంలో, తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న ఎనిమిది సీట్లలో పవన్ కల్యాణ్ ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్న చర్చ మొదలైంది. తెలంగాణలో అంతంతగా ఉన్న జనసేనకు తాజా ఫలితాలు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాయో చూడాలి. పవన్ కళ్యాణ్ రంగంలో దిగితే అది బీజేపీకి కూడా లాభదాయకమన్న భావన ఉన్నప్పటికీ, అసలుకే ఎసరవుతుందోమోనన్న వర్రీలో కొందరు బీజేపీ నేతలున్నారు. అదే సమయంలో జనసేనకు కేటాయించిన ఎనిమిది సీట్లలో ఎలాంటి ఫలితం రాబోతుంది అన్నది చూడాలి. మరీ ముఖ్యంగా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కూకట్ పల్లిలో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన వారు కూకట్ పల్లిలో పెద్ద సంఖ్యలో ఉన్నా.. కమ్మ సామాజికవర్గం ప్రభావవంతంగా ఉంది. ఇప్పుడు వారంతా జనసేన బలపర్చిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌కి ఓటేస్తారో, లేదంటూ గులాబీ పార్టీకా లేదంటే, కాంగ్రెస్‌కా అన్నది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చింది. ఐతే ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు రావడంతో ఆ వర్గం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి జైకొడతారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఏపీలో ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తు కుదిరినందున జనసేన పోటీ చేస్తున్న కూకట్‌పల్లిలో కన్సొలేషన్‌గా పవన్ కల్యాణ్ బలపర్చిన అభ్యర్థికి కమ్మ ఓటర్లు కూడా దన్నుగా నిలిస్తే… ఎన్నికల్లో గెలుపు అంత కష్టం కాదన్న భావన ఉంది.

కూకట్‌పల్లిలో ఆంధ్రా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో కమ్మ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. సుమారుగా 30 నుంచి 35 వేల మంది వరకు కమ్మ ఓటర్లు కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉన్నారన్న అంచనాలున్నాయి. వీరంతా బీజేపీ బలపర్చిన జనసేన అభ్యర్థిని కూకట్‌పల్లిలో ఏ మేరకు ఆశీర్వదిస్తారన్నది చూడాలి. వచ్చే రోజుల్లో ఏపీలో పొత్తు పొడుపులతో జగన్ సర్కారును కూలదోయాలని చూస్తున్న పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో ఆ సామాజికవర్గం, జనసేన అభ్యర్థులకు ఏ మేరకు ఓటేస్తుందన్నది చూడాల్సి ఉంది. జనసేన అభ్యర్థులు ఎన్నికల్లో ఎంత మేరకు ఓటింగ్ రాబడతారన్నది కూడా తేలనుంది జనసేన పోటీ చేస్తున్న 8 నియోజకవర్గాల్లో 6 చోట్ల కమ్మ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. కూకట్‌పల్లితోపాటు, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేటలో కమ్మ సామాజికవర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక తాండూరు, నాగర్ కర్నూల్‌లో అంతంత మాత్రంగానే ఉన్నారు. ఏపీలో టీడీపీ- జనసేన మధ్య అవగాహన నేపథ్యంలో టీడీపీ నాయకత్వం ఇప్పుడు జనసేన అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా పిలుపునిస్తుందో లేదో చూడాలి. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కమ్మ సామాజికవర్గం, జనసేన ప్రతిపాదిస్తున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై జనసేన గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలా కాని పక్షం, వచ్చే రోజుల్లో ఏపీలో టీడీపీ-జనసేనపై పొత్తు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ వయా, ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ ఐకమత్యం కోసం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలు ఏ పాటివన్నది తేలుతుంది.