Home Page SliderInternational

ఇంగ్లీషును ఇటలీ నిషేధిస్తుందా?

విదేశీ భాషలను నిషేధించే దిశగా ఇటలీ పావులు కదుపుతోంది. ఇటీవలే చాట్‌జీపీటీని నిషేధించింది. అధికారిక వ్యవహారాలలో విదేశీ భాషలను అంగీకరించమని తేల్చి చెప్పింది. విదేశీ భాషల కారణంగా తమ మాతృభాష ఇటాలియన్ అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్రహించి ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ అనే పార్టీ బిల్లు పెట్టింది. ఇది ప్రధాని జార్జియా మెలోని నేతృత్వంలో ఉంది. ఈ బిల్లుకు ఇప్పటికే ప్రధాని మద్దతు తెలిపారు. ఇటాలియన్ కాకుండా ఏ ఇతర విదేశీ భాష లో అధికారిక కార్యకలాపాలు జరిగితే లక్ష యూరోల జరిమానా విధించనున్నట్లు ఆబిల్లులో ఉంది. ఇంకా ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చలు జరగవలసి ఉంది.

ప్రతీ ప్రభుత్వ అధికారికి ఇటాలియన్ భాషపై పట్టు ఉండాలి. చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలి. ఆర్టికల్ 1 ప్రకారం ప్రాధమిక భాషగా ఇటాలియన్‌ను ఉపయోగించాలి. దేశంలోని వస్తు సేవల ప్రచారం కోసం కూడా ఇటాలియన్ భాష తప్పనిసరి చేశారు. ఈ నిబంధనలు పాటించకపోతే ఆ తప్పిదాన్ని బట్టి 5 వేల నుండి లక్ష యూరోల వరకూ జరిమానా భరించక తప్పదు. చూశారా.. వారికి వారి మాతృభాషపై ఎంత అభిమానమో, దానిని అంతరించకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అలాగే ‘ఇటాలియన్ ఆఫ్ దిఈస్ట్’ అని పేరు పొందిన తెలుగు భాషపై మనకు కూడా అభిమానముంటే ఇలాంటి చర్యలు మన ప్రభుత్వాలు కూడా కొంచెమైనా చేపడితే తెలుగుభాషకు భవిష్యత్తు బాగుంటుంది కదా..