ఇండియాను ఇకపై భారత్ అని పిలుస్తారా? దేశంలో పేరు మార్పుపై రగడ
G 20 సమావేశాల ఆహ్వానాలపై సంప్రదాయ ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉపయోగించడం సంచలనం కలిగిస్తోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు కొన్ని రోజుల ముందు వచ్చిన ఈ చర్య రాజకీయంగా దేశంలో వేడిని పెంచేస్తోంది. విదేశీ ప్రతినిధుల కోసం ఉద్దేశించిన G20 బుక్‌లెట్‌లో కూడా “భారత్” ప్రస్తావన కన్పించింది. “భారత్, ప్రజాస్వామ్యానికి తల్లి”. “భారత్ అనేది దేశం అధికారిక పేరు. ఇది 1946-48 చర్చల్లో కూడా రాజ్యాంగంలో ప్రస్తావించబడింది” అని బుక్‌లెట్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, UK ప్రధాన మంత్రి రిషి సునక్, ఇతర అగ్ర ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి దేశం సిద్ధమవుతున్నందున ఇది అంతర్జాతీయ వేదికపై పేరు మార్పు చర్చకు కారణమవుతోంది.

బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా గత రాత్రి కూడా ప్రధాని ఇండోనేషియా పర్యటనపై ఒక పత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. మోడీ “భారత్ ప్రధాన మంత్రి” అని పేర్కొన్నారు. సెప్టెంబరు 18న ప్రారంభమయ్యే ఐదు రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ నెలాఖరులో దేశం పేరును మార్చే తీర్మానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకురావచ్చని తెలుస్తోంది. ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం ఎటువంటి ఎజెండాను ప్రకటించకపోవడమే దీనికి కారణం. ఈ చర్యపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించి భారతదేశాన్ని విభజించిందని ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూటమి సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.

ఇండియా కూటమి ఏర్పాటుకు ప్రభుత్వ ఎత్తుగడను ముడిపెట్టారు. ప్రతిపక్ష కూటమి తమను ‘భారత్’గా పిలుచుకోవాలని నిర్ణయించుకుంటే అధికార పార్టీ దేశం పేరును మారుస్తుందా అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు. “దేశానికి సంబంధించిన పేరుపై అధికార పార్టీ ఎందుకు కలవరపడుతుందో నాకు అర్థం కావడం లేదు” అని NCP చీఫ్ అన్నారు. అయితే బీజేపీ నాయకులు “భారత్” పేరు మార్పును స్వాగతించారు. ఐతే ఈ చర్యపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నిర్ణయం దేశ వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.

“భారత్” అనే పదం రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో కూడా ఉందని, “ఇండియా అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది” అని చెబుతోంది. ‘భారత్’ను ఉపయోగించాలనే నిర్ణయం వలసవాద ఆలోచనా ధోరణికి వ్యతిరేకంగా చేసిన పెద్ద ప్రకటన అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. “ఇది ఇంతకు ముందే జరగాల్సి ఉంది. ఇది నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. ‘భారత్’ మా పరిచయం, దాని గురించి గర్విస్తున్నాం. రాష్ట్రపతి ‘భారత్’కి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. బీజేపీ సైద్ధాంతిక గురువు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్, ఇండియాను భారత్‌కి మార్చాలని సూచించిన రెండు రోజులకే వివాదం చెలరేగింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత్ అనే దేశం భారత్‌గానే ఉంటుంది.. మాట్లాడినా, రాసినా, భారత్ మాత్రమే ఉండాలి’’ అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.