డీకే శివకుమార్ KPCC పదవికి రాజీనామా చేస్తారా?
కర్ణాటకలో అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి కర్ణాటక సీఎం ఎవరని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా కర్ణాటకలో సిద్ధరామయ్య,డీకే శివకుమార్ సీఎం పదవి రేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య సీఎం పదవి కోసం తీవ్రమైన పోటి నెలకొంది. అయితే మాజీ సీఎంగా ఉన్న సిద్దరామయ్య తన అనుభవాన్ని చూపి పదవి నాకే ఇవ్వాలి లేకపోతే సీఎం పదవిని పంచుకోవాలి అనే ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఉంచారు. మరోవైపు డీకే శివకుమార్ మాత్రం పదవి తనకే కావాలి అని తేల్చి చెప్పకపోయినప్పటికీ నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డాను అని చెప్తున్నారు. దీంతో వీరిలో ఎవరిని సీఎం చెయ్యాలో అర్థంకాక కాంగ్రెస్ హైకమాండ్ తల పట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వకపోతే ఆయన తన KPCC పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దీనిపై డీకే శివకుమార్ స్పందించారు.తాను కర్ణాటక పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విధంగా తనపై తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని డీకే హెచ్చరించారు. కాగా కాసేపటి క్రితమే డీకే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటి అయ్యారు.ఈ క్రమంలో ఖర్గే సాయంత్రం 6 గంటలకు సిద్దరామయ్యతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.