Home Page SliderTelangana

కోరుట్లలో అర్వింద్ బోణీకొడతారా ?

కరీంనగర్ జిల్లాలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి విశిష్టమైన గుర్తింపు ఉంది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం ఏర్పడక ముందు బుగ్గారంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత ఆ పార్టీకి మద్దతుగా నిలిచింది. తెలంగాణ ఉద్యమంలో కోరుట్ల ప్రత్యేకత సంతరించుకొంది. ఇక్కడ్నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాలుగు సార్లు గెలిచారు. మరోసారి ఎన్నికల బరిలో ఆయన నిలుస్తారని భావించినా, రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని విధంగా కేసీఆర్ ఆయనకు మినహాయింపు ఇచ్చారు. దీంతో విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకు తొలిసారి గులాబీ పార్టీ అవకాశం లభించింది. ఇక్కడ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తోండగా, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు, జువ్వాడి నర్సింగరావు తిరిగి బరిలో నిలుస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌లో కాకుండా అర్వింద్ కోరుట్లలో పోటీకి దిగడం వెనుక సామాజిక సమీకరణాలున్నాయన్న భావన నెలకొంది. అన్నీ లెక్కలు వేసుకొని అర్వింద్ కోరుట్లలో పోటీకి దిగారని పార్టీ నాయకులు చెబుతున్నారు. కోరుట్ల నుంచి అర్వింద్ గన్ షాట్ ‌గా విజయం సాధిస్తారంటున్నారు పార్టీ నేతలు. అయితే గతంలో ఇక్కడ్నుంచి విజయం సాధించిన జువ్వాది రత్నాకర్ రావు మంత్రిగా కీర్తి పొందారు. ఆయన తనయుడిగా తాను ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి తీరుతానంటున్నారు నర్సింగరావు. కోరుట్లలో జెండా ఎగురేసేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోండటంతో ఇక్కడ ఎన్నిక హోరాహోరీగా సాగబోతోంది. ముక్కోణపు పోటీలో విజేత ఎవరైనా స్వల్ప మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వెలమ అభ్యర్థులుగా కాగా అర్వింద్ మున్నూరు కాపు సామాజికవర్గానికి ప్రతినిధ్యం వహిస్తున్నారు.

కోరుట్ల మొత్తం పోలింగ్ బూత్‌లు 262 . పురుష ఓటర్లు 1,13,030 కాగా, మహిళా ఓటర్లు 1,23,692, ట్రాన్స్‌జెండర్లు నలుగురున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,36,726 ఉన్నారు. ఇక ఆయా సామాజికవర్గాల వారీగా చూస్తే కోరుట్లలో మొత్తం ఇతర బీసీ వర్గాలకు చెందిన వారు 16 శాతం వరకు ఉన్నారు. మున్నూరు కాపులు 12 శాతం వరకు ఉండగా, ముస్లింలు 11 శాతం ఉన్నారు. కోరుట్లలో చేనేతలు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. పద్మశాలీ ఓటర్లు మొత్తం 10 శాతానికి పైగా ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం ఎనిమిదిన్నర శాతం, మాదిగలు 8 శాతం, మాలలు ఏడున్నర శాతం, ముదిరాజ్‌లు నాలుగున్నర శాతం, గౌడ్‌లు, విశ్వబ్రాహ్మణులు, వైశ్యులు 4 శాతం, ఇతరులు 7 శాతం వరకు ఉన్నారు.