చంద్రబాబు లక్ష్యం నెరవేరేనా?
◆ వైసీపీ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు
◆ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి
◆ ప్రతి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు సమగ్ర అధ్యయనం
◆ ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలకు పిలుపు
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో ప్రభుత్వంపై దాడికి సిద్ధమవటానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సమాయత్తమయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నేతలకు దిశా నిర్దేశం చేస్తు ఎన్నికలకు ఏడాదిన్నర ముందే వ్యూహాలకు పదును పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో ఒక్కో అడుగు వ్యవహాత్మకంగా వేస్తూ వస్తున్నారు. ఒకవైపు సంస్గాగతంగా భారీ మార్పులు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ విధానాలను వైఫల్యాలను ప్రజల దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లా టికెట్లు కేటాయించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

మారుతున్న కాలానికి రాజకీయాలకు అనుగుణంగా పార్టీలో మార్పులు తెస్తూనే మరొకవైపు ఎన్నికల సంగ్రామానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకునే పనిలో చంద్రబాబు తలమునకలయ్యారు. దీనిలో భాగంగానే ప్రతి నాయకుడు ఇప్పటినుండే ప్రజాక్షేత్రంలో పూర్తిస్థాయిలో ఉండేలా ఒక కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రాంతాలు వారీగా పర్యటనలు చేస్తున్న చంద్రబాబు స్థానికంగా ఉన్న జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల్లో ప్రజా సమస్యలే అజెండాగా తీసుకొని నేతలకు సూచనల చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉదాహరణలతో సహా ప్రజాక్షేత్రంలో ఎండ కట్టాలని ప్రతి చిన్న అంశాన్ని సమగ్రంగా అధ్యయనంతో వివరించే ప్రయత్నం చేయాలని నేతలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నీటిపారుదల రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందన్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నేతలకు హితబోధ చేస్తున్నారు. అలానే వ్యవసాయ రంగంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను రైతుల ఇబ్బందులను ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపు నష్టపరిహారం లాంటి అంశాలను ఆయా వర్గాల వారికి వివరించి పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని ద్వారా దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఒకవైపు పార్టీని పటిష్ట పరుస్తూ వస్తున్న చంద్రబాబు, పనితీరు సక్రమంగా లేని నేతలకు తనదైన శైలిలో సీరియస్ వార్నింగ్‌లు ఇస్తున్నారు. మార్పులు తప్పవని పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రత్యామ్నాయ నాయకత్వంపై కూడా దృష్టి పెట్టారు. అనివార్యమైతే ఇన్చార్జ్ లను కూడా మార్చేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నట్లుగా స్పష్టం అవుతుంది. ప్రతి ఒక్కరు ఎన్నికలకు సిద్ధం కావాలని అందుకు కావలసిన కార్యాచరణ వ్యవహారాలు ఆర్థిక కార్యాచరణలు కూడా రూపొందించుకోవాలని నేతలకు చంద్రబాబు సూచిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తన రహస్య నివేదికల ద్వారా తెప్పించుకొని అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు సమాచారం.

