NewsTelangana

భగీరధ..విద్యార్ధుల దాహాం తీర్చేనా?

అసలే పరిస్ధితులు క్లిష్టంగా ఉన్నాయి. శుచి శుభ్రత లేని ఆహారం కానీ.. నీటిని కానీ తీసుకుంటే అంతే సంగతులు అని వైద్యులు చెబుతున్న మాట. పైగా పరిస్ధితులు కూడా అలాగే ఉన్నాయి. ఓ మహమ్మారి బారి నుండి తప్పించుకుని జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఇప్పుడు నిపుణులు చేస్తున్న హెచ్చరికలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రతిరోజూ మనం త్రాగే నీటిలో ఖనిజ లవణాలు లోపించడం వల్లే  70% వ్యాధులు సోకుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సురక్షితమైన నీటిని అందిచాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ సర్కార్ మిషన్ భగీరధను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్  దీనిని  ప్రారంభించారు.

లక్ష్యం మంచిదే. కానీ.. వాటి ఫలాలు ఎంత మందికి అందుతున్నాయి అన్నదే ప్రశ్న. ఈ పథకం ప్రభుత్వ పాఠశాల్లోి పిల్లల దాహాన్ని కూడా తీర్చలేకపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ శాఖల సమన్వయ లోపం కారణంగా ప్రభుత్వ పాఠశాలలకు మంచినీరు అందిచాలన్న ప్రభుత్వ ఆశయం నీరు గారిపోతోంది. దీంతో పిల్లలు ఎప్పటిలాగానే బోరు బావులు, చేతి పంపుల నీటినే తాగాల్సి వస్తోంది. మరోప్రక్క మిషన్ భగీరథ పైపులైన్లు కూడా సరిగ్గా లేకపోవడం.. ఈమధ్య వరుసగా కురుస్తున్న వర్షాలకు ఆ నీరు కూడా కలుషితం కావడం శాపంగా మారింది. కలుషితమైన భగీరధ జలాలను తాగడానికికూడా వెనుకంజ వేయాల్సి వస్తోంది. కొన్ని పాఠశాల్లో ఇంటి నుంచి మంచినీళ్ళ బాటిళ్ళను తెచ్చుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఇలాంటి సమస్యలను పూర్తి స్ధాయిలో పరిష్కరిస్తేనే మిషన్ భగీరధ లక్ష్యం నెరవేరినట్టు.