బాబు ప్లాన్ ఫలిస్తుందా ? వైసీపీకి చెక్ పడుతుందా?
వ్యూహాలు పూర్తిగా మారుతున్నాయి. అడుగులు ఆచితూచి పడుతున్నాయి . ఢిల్లీ నుండి స్క్రీన్ ప్లే నడిపేందుకు చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. ఎన్.డీ.ఏతో పొత్తుకట్టి .. సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నారు. అంతా పాత మిత్రులే. గతంలో చేసిన కాపురమే. అడుగు పెట్టే ఛాన్స్ ఇస్తే .. ఆట మొదలు పెట్టేందుకు సిద్ధం అంటున్నారు. రాజకీయాలో శాశ్వత మిత్రులు .. శాశ్వత శత్రువులకు తావు లేదు. నిన్న శత్రువుగా పరిగణించిన వారితో ఇవ్వాల చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. మొన్న మిత్రుడు అనుకున్న వారు బద్ధ శత్రువుల వలే మారిపోతున్నారు. ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన నోళ్ళతోనే విమర్శలు చేస్తున్నారు. ఇదంతా రాజకీయ రంగస్ధలం మీద సహజమే. నిన్నటి వరకు ఎన్.డీఏ తో పెనేసుకు తిరిగిన నితీష్ ఇప్పుడు .. గూడు మార్చాడు. మాట మార్చాడు. మనుషులను మార్చాడు. సిద్దాంతాలన్నీ చుట్టచుట్టి పక్కన పెట్టి .. నీవే దిక్కంటూ ఆర్జేడీ తలుపు తట్టాడు. ఇలా.. వచ్చి వెళ్ళి పోతున్న వారు .. వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు.

ఒకప్పుడు ఎన్.డీఏ లో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కూడా గత ఎన్నికల సమయంలో చేసింది అదే. ప్లేట్ మారిస్తే.. ఫేట్ మారుతుందని భావించాడు. కానీ అనుకున్నదొకటి.. జరిగింది మరొకటి. ఉన్న ఫేట్ కూడా తల్లకిందులయ్యింది. మొక్కుబడి సీట్లను గెలుచుకుని అసెంబ్లీలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ గా మారిపోయారు. వైసీపీ బలీయమైన శక్తిగా ఆవిర్భవించింది. వాళ్ళు కూడా ఊహించనన్నీ స్ధానాలను గెలుచుకుంది. మొత్తం 175 సీట్లలో 151 నియోజకవర్గాలలో జైత్ర యాత్ర చేసి .. కొత్త అధ్యాయానికి తెర తీసింది. అంతే.. ఊహలు తల్లకిందులు కావడం.. అంచనాలు చెల్ల చెదురవడం.. ఆశలు నీరు కారి పోవడం వంటివన్నీ జరిగాయి. తెలుగుదేశం డీలా పడిపోయింది. ఆ పార్టీని పూర్తిగా కడిగేసి.. కింది స్ధాయి నుంచి వైసీపీ అజేయ శక్తిగా ఎదిగింది. దానితోపాటు కష్టాలు కూడా మొదలయ్యాయి. వరుస పెట్టి కేసులతో వేధింపులు మొదలయ్యాయి. జైళ్ళకు వెళ్ళని టీడీపీ నేత లేడంటే ఆశ్చర్యమే మరి. ఇక ఉపేక్షించి లాభం లేదు మిత్రమా.. సమరమా ? సాన్నిహిత్యమా అంటూ కొత్త పల్లవి అందుకుంది టీడీపీ. ఎదురవుతున్న అవమానాలను తట్టుకోవాలంటే.. భవిష్యత్ లో ఉనికికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలంటే.. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి ? మల్లగుల్లాలు పడ్డారు. మేధస్సుకు పని చెప్పారు. చూద్దాం కాలం .. ఎలా ఉండబోతోందో అని తమలో తామే సద్ది చెప్పుకున్నారు. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ టైమ్ కోసం ఎదురు చూశారు. అదే సమయంలో బీహార్ పరిణామాలు గిర్రున తిరిగాయి. నితీష్ బొంగరంలా తిరుగుతూ మహాకూటమి ముందు ఆగాడు.

ఇప్పుడు ఎన్.డీ.ఏలో ఓ పోస్ట్ ఖాళీ అయ్యింది. దానిపై గురి పెట్టాడు చంద్రబాబు. ఆ స్ధానంలోకి తెలుగుదేశాన్ని చేర్చేందుకు తెర వెనుక మంత్రాంగాన్ని నెరపుతున్నారు. దీనికి తోడు అవకాశం కూడా కలిసొచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశాలలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం ఓ శుభ పరిణామమే అనుకున్నారు. ఆ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చందజ్రబాబును ఆప్యాయంగా పలకరించడం.. ఢిల్లీ తరచూ వస్తూ ఉండండి అంటూ ఓ సంకేతాన్ని ఇవ్వడం చూస్తే .. టీడీపీ తమకు కాలం కలిసొచ్చే రోజులు వచ్చాయని భావిస్తోంది. అంతే.. ఇక చక్రం తిప్పాల్సిందే. ఢిల్లీ వేదికగా అస్త్రాలు సంధించాల్సిందే అనుకున్నారు. మోదీ ప్రాపకం కోసం ఎదురు చూపులు చూస్తూ .. అపాయింట్ మెంట్ కోసం ఓ బ్యాచ్ ప్రయత్నాలు చేస్తోంది.

ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్ ఇప్పుడు బయటకు వెళ్ళి పోవడంతో ఆస్ధానాన్ని భర్తీ చేసే పనిలో బీజేపీ కూడా ఉంది. దీనినే అవకాశంగా తీసుకుని ఎన్.డీ.ఏలో చేరిపోవాలని టీడీపీ ఆశిస్తోంది. ఈ దిశగా తన ప్రయత్నాల జోరును పెంచింది. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసి .. పూర్తి స్థాయిలో చర్చలు జరిపేందుకు ప్లాన్ చేసుకుంటోంది. వారి అపాయింట్ మెంట్ కోసం ఢిల్లీలో టీడీపీ నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. బాబు కూడా ఇక తరచూ ఢిల్లీ వెళ్ళి, జాతీయ నేతలతో ఎన్.డీ.ఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికిప్పుడు ఎన్.డీ.ఏలో చేరే బలమైన పార్టీలు కూడా ఏవీ కనిపించడం లేదు. దీనిని బాబు అడ్వంటేజ్ గా తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తారని భావిస్తున్నారు. ఒకప్పుడు ఆయన ఎన్.డి.ఏకి కీలక మిత్రుడు, మంచి భాగస్వామి. కాలం కలిసి రాక చతికిల బడ్డా.. కాకలు తీరిన రాజకీయానుభవం ఉంది. అందుకే అలాంటి మిత్రుల అవసరాన్ని కూడా బీజేపీ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలోనే మళ్ళీ కలుద్దాం అంటూ ఓ సంకేతాన్ని మోదీయే ఇచ్చినట్లు టీడీపీ భావిస్తోంది. ఇక ఏపీలో కాలు మోపాలంటే అటు జనసేన.. ఇటు టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే సరైన మార్గమని కమలనాధులు కూడా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. కలిసికట్టుగా దిగితేనే .. అందరికీ ప్రయోజనం అన్న సిద్ధాతం తెరమీదకు తెస్తున్నారు. ఇదే జరిగితే .. టీడీపీ, ఎన్డీఏలో కలిస్తే .. పొత్తులు ఫలిస్తే .. వైసీపీకి నష్టం తప్పదని కూడా అంచనాలు కడుతున్నారు. గతంలో టీడీపీపై విమర్శలు చేసిన రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఇప్పుడు స్వరాన్ని తగ్గించి .. స్నేహగీతాలాపనలు చేస్తున్నారు.

రాష్ట్రంలో పట్టీపట్టనుట్టు ఉన్నా.. ఢిల్లీ లో బీజేపీకి జగన్ సలామ్ కొట్టి రావడం .. మోదీకి వంగి దండాలు పెట్టడం .. ఆ పార్టీకి దగ్గరగా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉండడం కొత్తగా అనిపించినా .. అందులో స్వకార్యమే ఎక్కువగా ఉందని టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. కేసుల నుండి బయటపడేందుకే జగన్ ఢిల్లీ నేతలతో గులామ్ గిరి చేస్తున్నాడని ఆరోపణలూ చేశారు. వారు అన్నా అనక పోయినా కేసుల భయం తీవ్రత కొద్దిగా తగ్గిందనే భావిస్తున్నారు. ఈక్రమంలో బీజేపీకి దగ్గరై జగన్ ను ఆ పార్టికి దూరం జరపాలని టీడీపీ ఎత్తుగడ కూడా. అయితే టీడీపీ వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న వైసీపీ ఇప్పుడేం చేయబోతోంది ? ఎన్డీఏతో టీడీపీ చేతులు కలిపితే పరిస్ధితి ఏంటి ? ఆ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ చంద్రబాబు ఆశించినట్లు ఎన్.డీఏ లోకి ప్రవేశం అంత సులభంగా లభిస్తుందా ? చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేస్తుందా అన్నది కూడా ఆసక్తి రేపుతున్న అంశాలు. చూద్దాం.. అసలేం జరగబోతోందో.
