సిట్ విచారణకు హాజరవుతా: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తాజాగా మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో సిట్ విచారణకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. మధ్యంతర రక్షణ కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, కోర్టు అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తాను విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.