Home Page SliderTelangana

తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే!?

కాంగ్రెస్ పార్టీని సుదీర్ఘ కాలం చూశారు?
తొమ్మిదేళ్లు కేసీఆర్ పాలన చూశారు?
కాంగ్రెస్ పక్షాన గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లడాన్ని చూశారు?
కేవలం ఓట్ల కోసమే పథకాల ప్రకటన చూశారు?
అధికారాన్ని డాబు, దర్పం కోసమన్న భావన ఓవైపు
అధికారం ప్రజా సేవకే అంకితమన్న భావన మరోవైపు
ఇప్పటికైనా ఆలోచించండి? ఒక్క ఛాన్స్ ప్లీజ్

దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు భిన్నంగా తెలంగాణలో రాజకీయం సాగుతోంది. తెలంగాణలో గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగుతుండగా అంతగా ముందు కాంగ్రెస్ పార్టీ పదేళ్లపాటు పాలన సాగించింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో గులాబీ సర్కార్ పాలన సాగుతోంది. అయితే పాలన డొల్లతనాన్ని నిలువెల్లా కన్పిస్తోంది. కేసీఆర్ చెప్పింది ఏది చేయకపోవడంతో పాటు, హామీలు అమలు అన్నీ కూడా ఆయన చేతగానితనం మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయ్. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్ సాక్షిగా ఉద్యమస్ఫూర్తితో అడుగుపెట్టిన నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ రాజకీయం రంగులు మార్చుతుంది తప్పించి ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. జరిగేలా చేయలేదు. ఈ మొత్తం వ్యవహారాలను తెలంగాణ జనం మౌన ప్రేక్షకులుగా చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిదేళ్ల అస్తవ్యస్థ పాలన తర్వాత ఓటేయాలని సుతరాము ఎవరు కూడా భావించడం లేదు. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేవలం ఓట్ల వేట మాత్రమే కొనసాగుతోంది. ఇన్నాళ్లు ప్రత్యర్థులను రాజకీయంగా తన వైపుకు తిప్పుకొని రాజకీయంగా పబ్బం గడుపుకున్న కేసీఆర్ రాజకీయానికి త్వరలో ఫుల్‌స్టాప్ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

ఓవైపు రంగులు మార్చే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు చూశారు. పథకాలు చెప్పడమే తప్పించి అమలు చేయని గులాబీ పార్టీని చూశారు. ఇలాంటి తరుణంలో వారు ముందు ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ఒక ఆశాదీపంలా కన్పిస్తోంది. అందుకే తెలంగాణలో తొలిసారి బీజేపీ సర్కారును ఏర్పాటు చేసేందుకు కమలనాధులు కసరత్తు చేస్తున్నారు. స్థానికంగా అందుకు తగిన ఏర్పాట్లును పార్టీ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ఇప్పుడు కేసీఆర్ సర్కార్ పై సమర శంఖం పూరించేందుకు కాషాయదళం అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటేయాలన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్ళేందుకు పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కేసీఆర్‌ను మరోసారి గెలిస్తే తెలంగాణ ప్రజల కష్టాలను ఎవరూ తీర్చలేరన్న అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికలు- ఓట్లు, లక్ష్యంగా కేసీఆర్ పథకాల ప్రకటనను ప్రజలు ఈసడించుకుంటున్నారు. దళితబంధు పథకమంటూ పెట్టి సమాజాన్ని ఎలా చీల్చారో అందరూ చూస్తూనే ఉన్నారు. కనీసం పథకాన్ని నిర్భాగ్య దళితులకు ఏమైనా ఇచ్చారా అంటే అదీ లేదు. ఇక్కడ పథకం ఇవ్వొద్దని, వద్దని ఎవరూ చెప్పలేదు. తెలంగాణలోని ఎస్సీలకు పది లక్షల ఇవ్వడాన్ని అందరూ హర్షించారు. అయితే సమాజంలో ఉన్న దళితులందరికీ పథకాన్ని వర్తింపజేయాల్సింది పోయి… పార్టీ కార్యకర్తలకు, పార్టీ రిఫరెన్స్ ఆధారంగా ఇవ్వడం ద్వారా అసలు సమస్య వస్తోంది.

ఇలా ఏ స్కీమును కూడా కేసీఆర్ ప్రజల కోణంలో ఆవిష్కరించలేదన్నది వంద శాతం నిజం. ఇలా ఏ నిర్ణయం తీసుకున్న కేవలం రాజకీయ అవసరాలు, రాజకీయ ఆకాంక్షలను ఫలింపజేసుకోవడానికి మాత్రమే కేసీఆర్ పనిచేస్తున్నారన్నది నిర్వివాదాంశం. తాజాగా మరోసారి ఎన్నికల్లో గెలవడం కోసం బీసీ బంధు, మైనార్టీ బంధు ఇలా రకరకాల బంధులంటూ, ప్రజలను ఏమార్చేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్. నాడు ఉద్యమ సమయంలో, తెలంగాణ భూములను ఆంధ్రా పాలకులు ఆమ్మేస్తున్నారంటూ చెప్పిన గులాబీ నేతలు ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఏదైనా కార్యక్రమాలు అమలు చేయడానికి కూడా గజం జాగా కూడా లేని దుస్థితి తీసుకొస్తున్నారు. భూములు అమ్మిన సొత్తుతో, పథకాలకు నిధులన్న భావన సైతం కలిగిస్తున్నారు. కేవలం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కేసీఆర్ ఎన్ని పన్నాగాలు పన్నినా… ఈసారి ప్రజలు ఆ పార్టీని విశ్వసించేందుకు సిద్ధంగా లేరు.

అందుకే తెలంగాణ ప్రజల ముందు, ఇప్పుడు బీజేపీ ఒక జనజాగృతిలా కన్పిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మించి మరో ఆప్షన్ కన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేస్తుంది. ఆ పార్టీ ఎలాంటి రాజకీయాలు చేస్తోందన్నది దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరాలు, అవకాశాల కోసం ఎలాంటి రాజకీయం చేస్తారన్నది చూశారు. పదవుల కోసం పార్టీలు ఎలా ఫిరాయిస్తారో కూడా చూశారు. కేసీఆర్‌కి ఎలా కొమ్ముగాస్తారో చూశారు. ఈ తరుణంలో తెలంగాణ జనానికి ఇప్పుడు ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్ అందుబాటులో ఉంది. బలమైన నాయకత్వం, సమర్థవంతమైన నాయకులు కలయికతో బీజేపీ ప్రజల ముందుకు మెరుగైన అజెండాతో వస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయదుంధుబి మోగించాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ జాబితాని సిద్ధం చేసిన నాయకులు త్వరలో అభ్యర్థులను ప్రకటించి, పూర్తిస్థాయిలో రాజకీయాన్ని రక్తి కట్టించాలని భావిస్తున్నారు.

మొత్తంగా తెలంగాణలో ఈసారి ఎగిరేది కాషాయ జెండానేనని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, పార్టీ అగ్రనేత ఈటల రాజేందర్… ఇందుకు సంబంధించి యంత్రాంగాన్ని సన్నద్ధం చేసుకుంటున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా… ఇప్పటికి పార్టీ నాయకులకు దేశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేయడం ద్వారా, డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి, తెలంగాణ ప్రజలకు మరిన్ని పథకాలు, నిధులు వస్తాయన్న భావనను కలిగిస్తున్నారు. అదే సమయంలో అవినీతి బంధుప్రీతి ఆశ్రితపక్షపాతం అన్నది లేకుండా పాలన సాగించేందుకు బీజేపీ సరైన ఎంపికగా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కళ్లారా చూశారు. బీఆర్ఎస్‌ పాలన ఎలా ఉందో చూశారు. ఇలాంటి తరుణంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయగలదన్న విశ్వాసాన్ని కలిగించాలని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.