శ్రీరామనవమిని ఎందుకు? ఎలా జరుపుకోవాలి?
రేపు (మార్చి 29) చై త్ర శుద్ధ నవమి నాడు హిందువులకు ముఖ్యమైన శ్రీరామనవమి పర్వదినం. శ్రీరామచంద్రుడు పుట్టిన వసంత రుతువులోని చైత్రమాస శుక్లపక్ష నవమి ఎంతో విశిష్ఠమైనది. అందుకే ఆ పరమాత్ముని జన్మదినాన్ని హిందువులంతా పండుగగా జరుపుకుంటారు. ప్రజానురంజకమైన పరిపాలన చేసిన ఆ మహానుభావుడు త్రేతాయుగంలో జన్మించి, వేలాది సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆదర్శ ప్రభువుగా ఆ రామచంద్రమూర్తినే చెపుతాం.

ఆదర్శరాజ్యం అంటే రామరాజ్యమేనంటాం. శ్రీరామాయణ కావ్యం అందరికీ తెలిసినదే. వాల్మీకి రచించిన శ్రీరామాయణం హిందువులందరికీ పరమ పవిత్రగ్రంథం. సీతారాముల కథ మానవులు ఎలా జీవించాలో మనకు తెలియజేస్తుంది. ఆదర్శ కుటుంబానికి, ఆదర్శభర్తకు, అన్నకు, తండ్రి మాటను జవదాటని ఆదర్శ కొడుకుకు ఉదాహరణగా శ్రీరాముడినే చూపిస్తారు. కేవలం రావణ సంహారానికే కాక, మానవుడు ఆదర్శంగా ఎలా ఉండాలో తెలియజేయడానికే ఆ శ్రీమహా విష్ణువు ఈ భూమిపై అవతరించి మానవునిగా ప్రవర్తించి చూపించిన అవతారం శ్రీరామావతారం. అందుకే యుగాలు మారినా, తరాలు మారినా ధర్మాత్ముడంటే రాముడే. ఆయన కథను ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాం. ఆయనకు ప్రతీ ఊరిలో దేవాలయాలు కట్టి పూజించుకుంటూనే ఉంటాం. ఈ భూమిపై మానవజాతి ఉన్నంతవరకూ రామకథ వినిపిస్తూనే ఉంటుంది.

ఈ రోజున దేశవ్యాప్తంగా రామాలయాలలో పూజలు జరుగుతాయి. తెలంగాణాలోని భద్రాచలంలో కూడా అతి వైభవంగా శ్రీసీతారాముల కళ్యాణమహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణంలో తలంబ్రాలు ఎంతో ప్రశస్తి పొందాయి. వీటికి వాడే బియ్యాన్ని కొందరు భక్తులు వారి చేతితో వడ్లు ఒలిచి సిద్ధం చేస్తారు. రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తారు. మన ఇళ్లలో కూడా యధాశక్తి శ్రీరామనవమిని చేసుకుంటాం. వేసవికాలం ప్రారంభంలో వచ్చే ఈ పండుగకు స్వామివారికి నైవేద్యంగా వడపప్పు, పానకం, అరటిపండ్లు సమర్పిస్తాం. ఈ రోజున శ్రీరామ పట్టాభిషేకం చిత్రాన్ని పూజగదిలో పెట్టి భక్తిగా రామ రక్షాస్తోత్రము, అష్టోత్తరాలతో పూజను చేసుకోవాలి. దేవాలయానికి వెళ్లి సీతాకళ్యాణ వైభవాన్ని దర్శించుకోవాలి. నీటితో నిండిన మట్టి కుండను, పానకాన్ని,వస్త్రాలను దానం చేయాలి.