ప్రధాని మోడీని విమర్శించేటంత పెద్దోడివా..! కేటీఆర్‌పై ఈటల ధ్వజం
ప్రధాని నరేంద్రమోడీపై కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, విమర్శలపై నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేటీఆర్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మాట్లాడుతున్న మాటలు విని తెలంగాణ జాతి సిగ్గుతో తలదించుకుంటోందన్నారు. ప్రధాని అంటే ఒక వ్యక్తి కాదని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పిన మాటలను మరచావా కేటీఆర్ అంటూ దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలు ప్రధానిని హేళనగా మాట్లాడినప్పుడు… దేశ ప్రధాని గౌరవించుకోవాల్సిన సంస్కారం లేదా అంటూ నీతులు బోధించింది మీరు కాదా కేసీఆర్ అని ఈటల ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు మోడీని విమర్శించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ప్రాజెక్టులను నిర్మించుకోగలుగుతున్నామని అప్పట్లో చెప్పిన వ్యక్తి కేసీఆరేనని … ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రధాని వస్తున్నారని మాట్లాడటం నీచమన్నారు. కేటీఆర్‌కు అసలు సంస్కారం ఉందా? లేదా? అన్నది తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు ఈటల.

కేంద్ర ప్రభుత్వ అండదండలు లేకుండా.. సహకారం లేకుండా.. ఈ రాష్ట్రంలో వందల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మించుకోగలిగేవారమా అని ప్రశ్నించారు ఈటల. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు 2500 కిలోమీటర్ల నేషనల్ హైవే నిర్మాణం జరిగితే.. తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు 3 వేల కిలో మీటర్ల మేర జాతీయ రహదారిని అభివృద్ధి చేసిందన్నారు. ఇది తెలంగాణకు మోడీ సర్కార్ చేసిన ఘనత అవునో కాదో చెప్పాలని ఈటల ప్రశ్నించారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేసీఆరే చెప్పారన్నారు. తెలంగాణ వచ్చేవరకు 74 వేల కోట్ల అప్పు ఉంటే ఎఫ్.ఆర్.బి.ఎం రుణాలు, గ్యారెంటీ రుణాల పేరుతో ఆరు లక్షల కోట్ల రూపాయలు రుణాలు అందించింది మోడీ ప్రభుత్వం కాదో చెప్పు కేసీఆర్ అంటూ ఈటల మండిపడ్డారు. కేసీఆర్ కడుతున్న ప్రాజెక్టులు, ఇస్తున్న సంక్షేమ పథకాలు, వేస్తున్న సోకులు, ఆడుతున్న డ్రామాలు అన్నీ కేంద్రం ఇస్తున్న అప్పులతోనేనంటూ విరుచుకుపడ్డారు.