మఫ్లర్ ఎందుకు ధరించడం లేదు కేజ్రీవాల్
శీతాకాలం ప్రారంభం కావడంతో ఢిల్లీలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకొంది. రెగ్యులర్‌గా మఫ్లర్ ధరించి కన్పించే కేజ్రీవాల్‌కు ఒక వింత ప్రశ్న ఎదురయ్యింది. డిసెంబర్ 4న జరగనున్న పౌర ఎన్నికలకు ముందు ప్రచారం చేస్తూ, కేజ్రీవాల్ మఫ్లర్ లేకుండా ఎందుకు బయటకు వచ్చానో వివరించారు. “సర్ అప్నే మఫ్లర్ నహీ పెహ్నా (మీరు మఫ్లర్ ఎందుకు ధరించడం లేదు)?” అంటూ ఓ మహిళ చేసిన కామెంట్స్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది. “అభి తాండ్ నహీ అయి (ఇంకా చల్లగా లేదు),” అంటూ కేజ్రీవాల్ నవ్వుతూ బదులిచ్చారు. అంతే కాదు… తన మద్దతుదారులు, అక్కడున్న వారితో సెల్ఫీ కూడా దిగారు. కేజ్రీవాల్ ప్రజల ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీ ట్విట్టర్లో మొత్తం వ్యవహారాన్ని షేర్ చేసుకొంది.
ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ తన సిగ్నేచర్ మఫ్లర్ లుక్కు బాగా ప్రాచూర్యం పొందాడు. చలి నుండి తనను తాను రక్షించుకోవడానికి చలికాలంలో తరచుగా మఫ్లర్ ధరించి కన్పించేవాడు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో, సీబీఐ తన ఇంట్లో సోదాలు చేస్తే అందులో ఏదీ దొరకదని, కేవలం లెక్కలు చూపని మఫ్లర్లు మాత్రమే కనిపిస్తాయని ఎగతాళిగా కేజ్రీవాల్ విమర్శించేవాడు. మఫ్లర్ ఎక్కడా అంటూ అభిమానులు ప్రశ్నించడం ఇదే మొదటిసారి కాదు.. 2019లో తన తప్పిపోయిన మఫ్లర్ గురించి ట్విట్టర్ వినియోగదారు ప్రశ్నించినప్పుడు మఫ్లర్ చాలా కాలం క్రితం బయటకు వచ్చేసిందని… ఐతే అది ప్రజలు గమనించలేదన్నాడు కేజ్రీవాల్.

