చెడు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్ ఎందుకు వస్తోంది?
క్యాన్సర్ ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యాధి. సాధారణంగా పొగ ఎక్కువగా తాగడం వల్లో, తాగుడు అలవాటు ఎక్కువగా ఉండడమో క్యాన్సర్‌కి కారణం అనుకుంటారు. కానీ ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్ కబళిస్తోందని చాలామంది బాధితులు బాధపడుతుంటారు. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు కూడా కారణం కావచ్చంటున్నారు డాక్టర్లు. కడుపులో మంట, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను తేలికగా తీసుకోవద్దంటున్నారు. స్టమక్ క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం చేయని కారణంగా కూడా క్యాన్సర్ బారిన పడే వాళ్లున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సైలంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్. ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయనప్పుడు ఇది సంభవిస్తుంది. జీర్ణ ఎంజైములు, జీవక్రియ హార్మోన్ల ఉత్పత్తికి పాంక్రియాస్ సహాయపడుతుంది. కామెర్లు, అకారణంగా బరువు తగ్గడం, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాల ద్వారా దీనిని గుర్తించవచ్చు. పారంపర్యంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకపోయినా వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని క్యాన్సర్లు జన్యుపరమైన లోపాల వల్ల కూడా వస్తుంటాయి. వాతావరణంలో పొల్యూషన్ కారణంగా, ఆహార పదార్థాలలో పెస్టిసైడ్స్ వాడకం కూడా క్యాన్సర్‌కు కారణాలవుతున్నాయి. చాలా రకాల చర్మక్యాన్సర్లు సూర్యుని తీవ్రమైన రేడియేషన్ సంభవించే ఆల్ట్రావయెలిట్ కిరణాల వల్ల కూడా వస్తున్నాయి.

