ఆంధ్రా లొల్లి, తెలంగాణలో ఎందుకు? చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణలో జరిగే రాజకీయాలకు, ఆంధ్రాలో జరిగే రాజకీయాలకు సంబంధం లేదన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్ అయ్యారని… ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే ఏపీలో నిర్మొహమాటంగా చేయొచ్చన్నారు. ఇవాళ ఒకరికి ర్యాలీ చేసేందుకు అనుమతిస్తే… మరుసటిరోజు ఇంకొకరు ర్యాలీలు చేస్తారన్నారు. అప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊర్కోవాలా అన్నారు కేటీఆర్. పక్కింట్లో పంచాయితీతో తెలంగాణకు ఏం సంబంధమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకరితో ఒకరు తలపడాలని, తేల్చుకోవాలన్నారు. రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు తీయాలన్నారు. ఏపీ పంచాయితీతో హైదరాబాద్‌లో కొట్లాడతామంటే చూస్తూ ఊరుకోవాలా అన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే, ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందన్నారు. అందుకే ఆందోళనలను అనుమతించడం లేదన్నారు.
ఏపీ పంచాయితీలకు తెలంగాణ వేదిక కావాలా అని మండిపడ్డారు. విజయవాడ, అమరావతి, రాజమండ్రి, కర్నూలు ఉన్నాయి కదా… అక్కడ ధర్నాలు చేయకుండా ఇక్కడ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతోంది రెండు రాజకీయ పార్టీల తగాదా అని కేటీఆర్ సూత్రీకరించారు. ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, ఉనికీ లేదన్నారు. ఇక్కడ ఆందోళనలు ఎందుకున్నారు. సెన్సిటీవ్ ఇష్యూలపై రన్నింగ్ కామెంటరీ అక్కర్లేదన్నారు. చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారని, న్యాయస్థానాల్లో తేలుతుందన్నారు. న్యాయస్థానాల్లో కేసు ఉన్నప్పుడు రోడ్లపై ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడొచ్చా అని కేటీఆర్ ప్రశ్నించారు. లోకేష్‌తో, జగన్‌తో, పవన్ కల్యాణ్ ముగ్గురూ తనకు దోస్తులన్నారు. ఆంధ్రలో ఎవరితో తగదాలు లేవని, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వాళ్లు కూడా ఇక్కడ ఏమీ పనిచేయడం లేదన్నారు. లేనిపోని పంచాయితీలు ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో ఆంధ్రా, రాయలసీమ, ఇతర ప్రాంతాల వారు అందరూ కలిసిమెలసి ఉన్నారన్నారు. లేని పంచాయితీలు ఇక్కడెందుకన్నారు. ఆంధ్రా ప్రజలు ఇక్కడ సంతోషంగా ఉన్నారన్నారు. పదేళ్ల నుంచి.. వాళ్లలో లేని వైషమ్యాలు లేపడం ఎందుకన్నారు. లోకేష్ ఒక స్నేహితుడి ద్వారా అడిగారని.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ర్యాలీలు చేస్తే పరిస్థితేంటని చెప్పానన్నారు. ఐటీ ఏరియాలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆందోళనలు లేవన్నారు. ఏపీ సోదరులు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. అన్నీ బాగుండాలంటే శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలన్నారు. ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడొచ్చు. రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఘర్షణలు, అనవసర పంచాయితీలతో ఇబ్బందన్నారు.

