Home Page SliderNational

న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును ఎందుకు మార్చారంటే..!?

లోక్ సభ ఎన్నికలకు ఏడాది ముందు ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజును తప్పించి… ఆ స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌ని నియమించారు. రిజిజు, ప్రభుత్వంలో, అత్యంత ఉన్నత స్థాయి మంత్రులలో ఒకరిగా, ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచారు. క్యాబినెట్ హోదా ఇచ్చి న్యాయ మంత్రిత్వ శాఖకు ఇచ్చిన ఏడాదిలోపే ఆయనను తక్కువ ప్రాధాన్యత ఉన్న భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖకు మార్చారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇప్పుడు న్యాయ మంత్రిత్వ శాఖ స్వతంత్ర బాధ్యతలను నిర్వర్తిస్తారు. న్యాయశాఖ మంత్రి కేబినెట్ హోదాలో లేకపోవడం ఇటీవలి చరిత్రలో ఇదే తొలిసారి. ఇన్నాళ్లు సహకరించినందుకు గానూ, మంత్రిత్వ శాఖ తరపున భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులందరికీ ధన్యవాదాలు చెబుతూ కిరణ్ రిజిజు ఉదయం ట్వీట్ చేశారు.

న్యాయమూర్తుల నియామకాల విషయమై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య విభేదాల నేపథ్యంలో కొత్త న్యాయశాఖ మంత్రి ముందు ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయి.
ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య గిల్లికజ్జాల నేపథ్యంలో న్యాయమూర్తులను నియమించే న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టును న్యాయశాఖ మాజీ మంత్రి చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యేవి. ఫిబ్రవరిలో, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలను క్లియర్ చేయడంలో జాప్యంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన సమస్యగా పేర్కొంది. ఇలా చేయడం వల్ల పాలన, న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది. రాజ్యాంగం ప్రకారం, ప్రజల అభిమతాల కేంద్రం పనిచేస్తోందంటూ ఈ సందర్భంగా కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. దేశంలో కొన్నిసార్లు కొన్ని విషయాలపై చర్చలు జరుగుతుంటాయి, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉంటుంది. కానీ బాధ్యతాయుతమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి, అది దేశానికి మేలు చేస్తుందా లేదా అని గుర్తుంచుకోవాలన్నారు. “ఎవరూ ఎవరికీ వార్నింగ్ ఇవ్వలేరు” అని నొక్కి చెప్పారు.

కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి తగిన విధంగా లేదని, ప్రజల మద్దతు లేదని రిజిజు గత సంవత్సరం చెప్పడంతో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఘర్షణ తీవ్రమైంది. “కేవలం కోర్టులు లేదా కొంతమంది న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయం వల్ల రాజ్యాంగానికి విరుద్ధమైన ఏదైనా, ఆ నిర్ణయానికి దేశం మద్దతు ఇస్తుందని మీరు ఎలా ఆశిస్తున్నారు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 2014లో పార్లమెంటు ఆమోదించిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జెఎసి) చట్టాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. న్యాయవ్యవస్థ నియామకాలలో ప్రభుత్వానికి ఎక్కువ పాత్రను ఇస్తోందని, దానిని సుప్రీంకోర్టు రద్దు చేయడంతో రెండు వర్గాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ప్రధాని సలహాను మేరకు ఈ ఉదయం రాష్ట్రపతి భవనం రిజిజు బదిలీని ప్రకటించింది. రిజిజు కొద్దిసేపటి తర్వాత తన ట్విట్టర్ ఫోటోను మార్చారు.