బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ దోస్తీ ఎందుకు?
నాడు దొర నుంచి విముక్తి కావాలన్నాడు.. తెలంగాణ బాగు కోసం దొర పోవాలన్నాడు.. కేసీఆర్ విముక్తి తెలంగాణ కోసం ఎవరితోనైనా కలుస్తానన్నాడు.. కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్ నుంచి జైలుకు పంపాలన్నాడు. కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి అంటూ విమర్శలు గుప్పించాడు. కుల్వకుంట్ల ఫ్యామిలీ పాలిట్రిక్ అంటూ మండిపడ్డాడు. ఇప్పుడు లౌకికవాదమంటూ అదే బీఆర్ఎస్‌తో జతకడుతున్నాడు. బీఎస్పీ తెలంగాణ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ఎత్తుగడ ఎందుకు కోసం? ఎవరి కోసం? పొత్తు వెనుక, బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రవీణ్ కుమార్ సిద్ధమయ్యాడా?

తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఎవరికి వారు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంటే.. మొన్నటి వరకు సింహం సింగిల్‌గా వస్తోందంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు, తాను ఎవరినైతే గుర్తించలేదో ఇప్పుడు అదే పార్టీతో పొత్తు దిశగా అడుగులు వేస్తోంది. రాజకీయాల్లో బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అంటే ఇదేనేమో… తెలంగాణలో తాజాగా జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు ఖాతా తెరుస్తుందా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పడొస్తున్న సర్వేలు సైతం బీఆర్ఎస్ పార్టీపై పెద్దగా అంచనాలు వేయడం లేదు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి.. బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించడం రాజకీయంగా సంచలనం కలిగిస్తోంది. ఇలాంటి మీడియా సమావేశాలకు దూరంగా ఉండే కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పక్కన నిలబడి పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కన్పించడం కొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్నట్టుగా దృశ్యం ఆవిష్కృతమయ్యింది.

తెలంగాణలో భూస్వామ్య, రాజరిక పాలన పోవాలంటూ కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో విమర్శించారు ప్రవీణ్ కుమార్. కేసీఆర్ సాక్షాత్తూ ఎలక్షన్ కమిషన్‌ను చీట్ చేశాడంటూ విమర్శించాడు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా వేలం వేస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరోలా చేశాడంటూ దుయ్యబట్టారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను అప్పులకుప్పగా మార్చిందని… ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్‌ను జైలుకు పంపే వరకూ బీఎస్పీ పార్టీ పోరాటం చేస్తుందంటూ కోతలు కోశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల అప్పు చేసి.. గంగపాలు చేశారంటూ దుయయ్బట్టారు.

సీన్ కట్ చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయ్. నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ ఎస్సీ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ప్రవీణ్ కుమార్ బరిలో దిగే అవకాశముందని తెలుస్తోంది. అయితే పొత్తుతోనా, బీఆర్ఎస్ పార్టీలో చేరతారా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై కేసీఆర్ నోరు మెదపలేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ పొత్తు, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం రాజకీయాన్ని విమర్శలను, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలవడంపై సీనియర్ ఐఐఎస్ ఆకునూరి మురళీ స్పందించారు. అన్యాయం పోలీస్ బాస్ అంటూ మండిపడ్డారు.