కూకట్ పల్లిలో ఎవరి జెండా ఎగురుతుంది!?
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక నియోజకవర్గం కూకట్‌పల్లిలో ఎవరు గెలుస్తారు? ఎలా గెలుస్తారన్నదానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ గుర్తింపు పొందింది. హైదరాబాద్ అభివృద్ధి అంతా కూకట్ పల్లిలో కన్పిస్తోంది. హైటెక్ సిటీతో లింకు ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం రాష్ట్రంలోనే సంపన్న ప్రాంతంగా మారిపోయింది. కూకట్ పల్లిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ గత పదేళ్ల క్రితం ఉన్నదానికి నేటికి రెట్టింపు అయ్యింది. అపార్ట్మెంట్ వాల్యూ సైతం గణనీయంగా పెరిగాయ్. ఇక గజం లక్ష రూపాయల నుంచి ధర పలుకుతోంది. కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూకట్ పల్లి, అల్లాపూర్, బాలానగర్, మూసాపేట్, ఫతేనగర్, బోయినపల్లి, ఫిరోజ్ గూడ, బేగంపేట్ కొంత ప్రాంతం ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకొంది. నియోజకవర్గంలో పాతుకుపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు ఇప్పుడు పెద్ద సంకటం వచ్చి పడంది.

ఆంధ్రా నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఓటర్ల ప్రభావం ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కాపు, కమ్మతోపాటు, శ్రీకాకుళం వలస కూలీలు గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. మైనార్టీలు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సుమారుగా 70-80 వేల వరకు ముస్లిం ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కూకట్ పల్లిలో బీఆర్ఎస్ తరపున మాధవరం కృష్ణరావు మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బండి రమేష్ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు. ఇక ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక్కడ్నుంచి బీఎస్పీ సైతం అభ్యర్థిని పోటీకి దించింది. కూకట్ పల్లి నియోజకవర్గంలో మొత్తం 417 పోలింగ్ బూత్ లకు వ్యాపించి ఉండగా మొత్తం 4,47,523 ఓట్లున్నాయి. వాటిలో పురుషులు 2,34,575 ఓట్లుకాగా, మహిళలు 2,12,828 ఓట్లు, ట్రాన్స్‌జెండర్ 120 ఉన్నాయి.