నిజామాబాద్ అర్బన్‌లో గెలిచేదెవరు?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో రెండు నియోజకవర్గాలు ఆసక్తి రేపుతున్నాయ్. ఒకటి కామారెడ్డి కాగా, మరోటి నిజామాబాద్ అర్బన్. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న షబ్బీర్ అలీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తోండటంతో నియోజకవర్గం మార్చుకోవాల్సి వచ్చింది. మైనార్టీలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి విజయం అంత ఈజీ కాకున్నప్పటికీ పార్టీ హైకమాండ్ ఆదేశాలతో షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ వచ్చారు. అయితే ఇక్కడ్నుంచి అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఎదిగారు బిగాల గణేష్ గుప్తా. 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. ఎన్నారైగా ఉన్న బిగాల గణేష్ గుప్తా.. నిజమాబాద్ రాజకీయాల్లో, బీఆర్ఎస్ కోటరీలోనూ కీలకంగా మారారు. ఈసారి నిజామాబాద్ అర్బన్ నుంచి గణేష్ గుప్తా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీని ఢీకొంటున్నారు. ఇక బీజేపీ నుంచి సూర్యనారాయణ గుప్తా ఇక్కడ రేసులో నిలిచారు. గతంలో ఇక్కడ్నుంచి సునాయశంగా గెలిచిన బిగాల గణేష్ గుప్తా ఈసారి శ్రమించకతప్పని పరిస్థితి నెలకొంది.

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 289 పోలింగ్ బూత్‌లు ఉండగా పురుష ఓటర్లు 1,39,163 స్త్రీ ఓటర్లు 1,47,571 ట్రాన్స్‌జెండర్లు 32 మొత్తం ఓటర్లు 2,86,766 ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ సిటీలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. జనాభాలో ఈ ఓటర్లు 21 శాతం. మున్నూరు కాపులు సైతం ఇక్కడ 19 శాతం వరకు ఉన్నారు. పద్మశాలీలు 17 శాతం వరకు ఉన్నారు. మాదిగలు 6, మాలలు 5 శాతం వరకు ఉన్నారు. వైశ్యులు 4 శాతం, విశ్వ బ్రహ్మణులు, ముదిరాజ్‌లు 3 శాతం చొప్పున ఉన్నారు. రజకులు 2 శాతం ఉండగా ఇతరులు 18-20 శాతం వరకు ఉన్నారు.

