జగిత్యాలలో ఆ జెండానే ఎగురుతుందా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కీలకమైన నియోజకవర్గం. చేనేత సామాజికవర్గం ప్రముఖంగా ఉండే ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపులు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జీవన్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఉపఎన్నికతో సహా జీవన్ రెడ్డి ఇక్కడ్నుంచి ఆరుసార్లు విజయం సాధించారు. మరోసారి ఆయన తన అదృష్టా్న్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ్నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ కుమార్ బరిలో నిలువగా, బీజేపీ నుంచి బోగా శ్రావణి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో జీవన్ రెడ్డి తన గెలుపు ఖాయమంటుంటే.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో తనదే విజయమని బీజేపీ అభ్యర్థి శ్రావణి లెక్కలు వేసుకుంటున్నారు. బీసీ ఓటర్లు తనకు అవకాశం ఇస్తారని ఆమె ఆశగా ఉన్నారు. ఇక జగిత్యాలలో గెలుపు నల్లేరుపై నడకేనని బీఆర్ఎస్ డాక్టర్ సంజయ్ కుమార్ సైతం భావిస్తుంటే.. జీవన్ రెడ్డి తన విజయం ఎప్పుడో ఖాయమైందంటున్నారు.

జగిత్యాల మొత్తం పోలింగ్ బూత్‌లు 254. పురుష ఓటర్లు 1,09,300, మహిళా ఓటర్లు 1,17,315 కాగా, ట్రాన్స్‌జెండర్లు 20 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,26,635 ఉన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఇతర బీసీలు 19 శాతం వరకు ఉండగా, మున్నూరు కాపులు 16 శాతం వరకు ఉన్నారు. ఇక్కడ ముస్లింలు 10 శాతం మేర ఉన్నారు. పద్మశాలీ 9 శాతం, మాదిగలు 7 శాతం, మాలలు 6 శాతం గొల్ల ఐదున్నర శాతం, విశ్వబ్రహ్మణలు 5 శాతం, గౌడలు నాలుగున్నర శాతం, వెలమలు 4 శాతం ఉండగా, ఇతరులు 15 శాతం వరకు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థులు… సామాజిక సమీకరణాలను వర్కౌట్ చేసుకోగలిగితే… గెలుపు అంత కష్టం కాదనిపిస్తోంది.

