చొప్పదండిలో విక్టరీ ఎవరిదంటే?
దండీగా మొక్కజొన్న కంకెలు లభించే ప్రాంతంగా రాను రాను చొప్పదండిగా పేరు మార్చుకున్న ఈ నియోజకవర్గంలో ఈసారి మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరీ తలపడుతున్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత పార్టీ నిరాకరణతో బీజేపీలో చేరిన బొడిగె శోభ.. నియోజకవర్గంలో మాంచి గుర్తింపు పొందారు. ఐతే బీజేపీ బూమ్ తగ్గాక ఇక్కడ్నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుపై దీమాతో ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ నియోజకవర్గం మొత్తం కలయ తిరగడం, ఇప్పటికే పలుసార్లు ఓటర్లను కలవడంతో… ఆమె ఎన్నికల్లో గెలుపుపై దీమాతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సొంకే రవశంకర్ మరోసారి గెలుపుపై దీమాగా ఉన్నప్పటికీ, అటు కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం, బీజేపీ అభ్యర్థి బోడిగ శోభ నియోజకవర్గమంతటా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో శోభ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి ఫైట్ ఇస్తున్నారు. 2009కి ముందు ఈ నియోజకవర్గం జనరల్ గా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్‌గా మారింది.

చొప్పదండి ఎస్సీ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ బూత్‌లు 327. పురుష ఓటర్లు 1,11,197 కాగా, మహిళా ఓటర్లు 1,18,141 మంది ఉన్నారు. ఇక ట్రాన్స్‌జెండర్లు ఎనిమిది మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,29,346 ఉన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాదిగలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మాదిగలు 13 శాతానికి పైగా ఉండగా, మున్నూరు కాపులు సైతం 13 శాతం వరకు ఉన్నారు. ఇక ఇతర బీసీ వర్గాలు కూడా అంతే సంఖ్యలో సుమారుగా 13 శాతానికి దగ్గరగా ఉన్నారు. ఇక పద్మశాలీలు 11 శాతం వరకు ఉన్నారు. గౌడలు 9 శాతం, రెడ్డి సామాజికవర్గం ఏడున్నర శాతం వరకు ఉన్నారు. తెనుగు-ముదిరాజ్‌లు సైతం 6 శాతానికి పైగా ఉన్నారు. మాలలు 6 శాతం ఉండగా, గొల్ల-కురుమలు 5 శాతానికి కొంచెం అటూ ఇటూగా ఉన్నారు. అగ్రవర్ణాలు మొత్తం 5 శాతానికి దగ్గరగా ఉన్నారు. నియజకవర్గంలో ఇతరులు 12 శాతం వరకు ఉన్నారు.

