విరాట్ కోహ్లి స్థానంలో ఆడేది ఎవరో ?
భారత్ స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్ లో అతడి స్థానంలో ఆడేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లి టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో నంబర్ 4 స్థానంలో ఎవరు ఆడాలనే తర్జనభర్జనలు మొదలయ్యాయి. టెస్టుల్లో సచిన్ వారసత్వాన్ని కోహ్లి అద్భుతంగా కొనసాగించాడు. బ్యాటింగ్ ఆర్డర్ ఎంతో కీలకమైన ఈ స్థానంలో విలువైన పరుగులు జోడించి.. జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే.. ఇప్పుడు ఆ స్థానంలో కెప్టెన్ శుభ్ మన్ గిల్ లేదా కరుణ్ నాయర్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమ్ ఇండియా (India vs England) సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ (Rohit sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలకడంతో.. యువ ఆటగాడు శుభమన్ గిల్ (Shubman Gill) సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. సీనియర్లు లేకుండా.. ఇంగ్లండు వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం గిల్ కు సవాలే. మరోవైపు పరుగుల వీరుడు విరాట్ కోహ్లి నంబర్ 4 స్థానం ఎంతో ప్రత్యేకమైంది. మరి అతడి ప్లేస్ ను భర్తీ చేసే ఆటగాడు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లి స్థానంలో కెప్టెన్ శుభమన్ గిల్ ఆడాలని మాజీ కోచ్ రవిశాస్త్రి సూచిస్తున్నాడు. ఆ స్థానానికి ఇప్పుడు గిల్ చక్కగా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు. “జైస్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాలి. అతడు ఎంతో అనుభవమున్న ఆటగాడు. గతంలో ఇంగ్లండ్పై ఓపెనింగ్ చేసి సెంచరీ సాధించాడు. ఇక నంబర్ 3లో సాయిసుదర్శన్ రావాలి. అతడు ఎంతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సిరీస్ అతడికి కీలకమవుతుంది. ఇక నాలుగో స్థానంలో గిల్ రావడం.. కెప్టెన్ గా అతడికి ఉత్తమం. నంబర్ 5లో కరుణ్ నాయర్ రావాలి” అని శాస్త్రి తన అంచనాలు వెల్లడించాడు. కోహ్లి ఆడే నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ వస్తే బాగుంటుందని మాజీ సెలెక్టర్ సబా కరీమ్ తన అభిప్రాయం వ్యక్తంచేశాడు. కేఎల్ రాహుల్ కు ఇంగ్లండ్ లో మంచి రికార్డు ఉందని పేర్కొన్నాడు. “ఇంగ్లండ్ లో కేఎల్ రాహుల్ 9 టెస్టులు ఆడి 614 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అక్కడి పరిస్థితులు అతడికి చక్కగా సరిపోతాయి” అని కరీమ్ పేర్కొన్నాడు. కోహ్లి స్థానాన్ని భర్తీ చేయడానికి రాహుల్ వద్ద సరైన టెక్నిక్ ఉందని చెప్పాడు. ఇంగ్లండ్ వంటి ప్రదేశంలో అతడు బ్యాటింగ్ లో సత్తా చాటుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.