Andhra PradeshNews

ఏపీలో కేసీఆర్ పార్టీలోకి వచ్చేదెవరు?

ఆంధ్రాలో కేసీఆర్ బీఆర్ఎస్
కేసీఆర్‌తో కలిసొచ్చేదెవరు?
కేసీఆర్ ఎవరిని ఫినిష్ చేస్తారు?
టీడీపీ నేతలపై గురిపెడతారా?
కర్నాటకపై కేసీఆర్ ఫోకస్
అటు ఒడిశా.. ఇటు ఛత్తీస్‌గఢ్

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు అంతే ఉండదు. అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడేందుకు ఆయన దేనికైనా సిద్ధపడతారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పీక్‌కు తీసుకెళ్లిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను ఒప్పించి.. తెలంగాణ రావడానికి కారకులయ్యారని ఎక్కువ మంది నమ్ముతారు. తెలంగాణ విషయంలో ఎప్పట్నుంచో ఉన్న సెంటిమెంట్‌ను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అంగీకరించాయి. దీంతో తెలంగాణలో సెంటిమెంట్ ఉపయోగించుకొని టీఆర్ఎస్ బలపడింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్ వరుసగా రెండు ఎన్నికల్లో సత్తా చాటారు. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ అసెంబ్లీకి 2019లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. కేసీఆర్ ఆరు నెలలు ముందుగానే అంటే 2018 డిసెంబర్‌లోనే ఎన్నికలు ఎదుర్కొన్నారు. లోక్ సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఇబ్బంది వస్తుందని భావించిన కేసీఆర్.. వ్యూహాలను సిద్ధం చేసి ముందస్తుకు వెళ్లారు. అనుకున్నట్టుగానే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కారు పార్టీ చతికిలపడింది. 17 స్థానాలకు టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3, బీజేపీ 4, మజ్లిస్ 1 స్థానాలు గెలుచుకున్నాయ్. కారు, సారూ.. పదహారు అంటూ ఆ పార్టీ నేతలు లోక్ సభ ఎన్నికల్లో గట్టిగా కొట్లాడారు. కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ నేతలు బొటాబొటి మెజార్టీతో గెలిచారు. లేకుంటే ఆ సీట్లు కూడా వచ్చేవి కావన్న విశ్లేషణలు ఉన్నాయ్.

తర్వాత జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమితో సీన్ చేంజ్ అయిపోయింది. గ్రేటర్ ఎన్నికలను సైతం ముందుకు మార్చి కేసీఆర్ పాచిక విసిరారు. 2016 తర్వాత 2021లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ముందస్తుగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్లారు. నాడు 99 డివిజన్లలో విజయం సాధిస్తే.. ఆ తర్వాత ఎన్నికల్లో కేవలం 56 స్థానాలకు గులాబీ పార్టీ పరిమితమైపోయింది. ఇలా టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతూ వచ్చింది. మధ్యలో పట్టభద్రుల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించినా.. హుజూరాబాద్ దెబ్బ తలబొప్పి కట్టేలా చేసింది. కేసీఆర్ అప్పటి వరకు ఆడింది ఆట.. పాడింది పాటలా ఉన్న సినారియో అంతా మారిపోయింది. కేసీఆర్ తొలి టర్మ్ సమయంలో… ఆయన అనుకున్నట్టుగా ఉపఎన్నికల్లో గులాబీ పార్టీ నేతలు విజయం సాధిస్తే.. సెకండ్ టర్మ్ లో మాత్రం ఉపఎన్నికలు కేసీఆర్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాయ్. హుజూరాబాద్ ఓటమి తర్వాత కేసీఆర్‌లో ఆందోళన క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తోంది. ఇలాంటి తరుణంలో మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి అనుకోని చిక్కులు తెచ్చిపెడుతోంది. వాస్తవానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడమంటే ఆషామాషీ కాదు. ఎన్నికలు వస్తే తప్ప అభివృద్ధిని పట్టించుకోరని కేసీఆర్‌ను జనంలో ఎండగట్టాలన్న లక్ష్యంతో రాజగోపాల్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారు. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ఓడించలేదని.. అది బీజేపీతో మాత్రమే సాధ్యమంటూ ఆయన ఘంటా బజాయించి మరీ చెబుతూ కమలం తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మునుగోడు ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న మునుగోడు ఫలితం తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మునుగోడులో జెండా ఎగరేయాలని అటు కారు పార్టీ.. ఇటు కమలం, హస్తం పార్టీలు పరితపిస్తున్నాయ్. ఎన్నికల్లో విజయం ద్వారా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోలేదని.. ఇంకా బతికే ఉందన్న అభిప్రాయాన్ని కలిగించాలని కాంగ్రెస్ తలపోస్తుంటే.. ఈ ఎన్నికలో గెలుపు ద్వారా తెలంగాణ రాజకీయాన్ని మొత్తం తమవైపు తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అందుకే బీజేపీ కోర్ టీమ్ ఇప్పుడు మునుగోడుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. అయితే మునుగోడులో పెద్ద ఎత్తున ఉన్న బీసీలు ఇప్పుడు మూడు పార్టీల నుంచి నిలబడిన అగ్రవర్ణ నాయకుల్లో ఎవరిని ఆమోదిస్తారన్నది మాత్రం సస్పెన్స్. ఓవైపు కేసీఆర్ దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటనకు రంగం సిద్ధం చేస్తుంటే.. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. మునుగోడు విక్టరీకి, జాతీయ రాజకీయాలకు పెద్దగా సంబంధం లేకున్నా… రెంటికీ అవినాభావ సంబంధముంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి డిసెంబర్‌లో ఢిల్లీలో సభ నిర్వహించాలని భావిస్తున్నారు. నవంబర్ 6న మునుగోడు ఫలితాలు వస్తాయ్. ఆ తర్వాత సీన్ కచ్చితంగా మారిపోనుంది. అయితే అంతకంటే ముందుగా కేసీఆర్ జాతీయ పార్టీని విస్తరించేందుకు తగిన బ్యాక్‌ గ్రౌండ్ రూపొందించుకుంటున్నారు. ఏపీపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత.. తెలంగాణ గోల నీకెందుకంటూ నాడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్. నాకు తెలంగాణ ఉంది. నీకు ఏపీ ఉంది. ఎవరి పని వాళ్లు చేసుకుంటే సరిపోతుందని చెప్పేవారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణపై వైసీపీ పూర్తి మౌనం వహించింది. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ దుకాణాన్ని బంద్ చేసింది. వైసీపీ నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీతో అనవసర తలనొప్పులు ఎందుకులే అన్న భావనలో ఉన్నట్టుగా కన్పించింది.

కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకంటే ఎక్కువగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడాతనంటున్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. కేంద్రంలోని బీజేపీ పోవాలని పదే పదే చెబుతున్నారు. అందుకు తాను జాతీయ రాజకీయాలకు నేతృత్వం వహిస్తానంటున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ కు తేలిగ్గా ఎంటరయ్యేందుకు ఏపీ మాబాగా కన్పిస్తోంది. గతంలో టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన కేసీఆర్.. ఏపీ రాజకీయ నేతలను తనవైపునకు మరల్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ విషయంలో జోక్యం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌కు మేలు చేస్తే.. ఇప్పుడు ఏపీ విషయంలో తన లెక్కలు తాను చూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డితో నేరుగా క్లాష్ లేకుండా పని కానిచ్చేయడం ఏపీలో సాధ్యం కాదు. కేసీఆర్ వెళ్లి ఏపీలో తేల్చుకుంటామంటే.. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో సైలంట్‌గా ఉండరు. మరి కేసీఆర్ తన జాతీయ పార్టీలోకి టీడీపీ నాయకులను తీసుకుంటారా.. కాంగ్రెస్ నేతలను తీసుకుంటారా.. లేదంటే వైసీపీ అసంతృప్తులను తీసుకుంటారా.. అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కేసీఆర్ తెలంగాణ ద్వారా జాతీయ రాజకీయాలు చేయాలనుకుంటే… అక్కడ ఉన్న 17 సీట్లు మాత్రమే గరిష్టంగా గెలుచుకోగలగుతారు. ఆ కొద్ది సీట్లతో ఆయన చేయడానికి ఏమీ ఉండదు. తమిళనాడు, కేరళ చాలా టఫ్.. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో కొంత మేర అవకాశం ఉంది. ఈ మొత్తం పరిణామాలను చూసినప్పుడు కేసీఆర్ వేసే అడుగుల్లో స్పష్టత లభించడం చాలా కష్టమనే చెప్పాల్సి ఉంటుంది.