Home Page SliderTelangana

జహీరాబాద్‌లో అదిరిందయ్య చంద్రం!

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్సీ నియోజకర్గంగా ఉన్న జహీరాబాద్‌లో గతంలో జనరల్ నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడ్నుంచి బాగా రెడ్డి 1957 నుంచి 1985 వరకు వరుసగా గెలిచారు. అంతే కాదు ఆయన 1989 నుంచి 1998 వరకు నాలుగు సార్లు మెదక్ ఎంపీగా చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, అపోజిషన్‌లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగానూ పనిచేశారు. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ నియోజకవర్గంలో గీతారెడ్డి అనూహ్య విజయాలు సాధించారు. ఆమె 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో ఇక్కడ్నుంచి మాణిక్ రావు అనూహ్య విజయం సాధించారు. మరోసారి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగగా.. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వికారాబాద్ నుంచి జహీరాబాద్ వచ్చి ఆయన ఈసారి అమీతుమీకి సిద్ధపడ్డారు. బీజేపీ నుంచి ఇక్కడ రామచంద్ర బరిలో దిగారు.

జహీరాబాద్ ఎస్సీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 313. పురుష ఓటర్లు 1,33,312. మహిళా ఓటర్లు 1,31,419 మంది కాగా ఒక ట్రాన్స్ జెండర్ ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లు 2,64,732 మంది ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు సుమారుగా 18 నుంచి 20 శాతంగా ఉన్నారు. మాదిగలు 15 శాతానికి, మాలలు సైతం 13 శాతానికి చేరువగా ఉన్నారు. ఇక ఇక్కడ లింగాయత్ ఓటర్లు సైతం 10 శాతం మేర ఉన్నారు. ముదిరాజ్‌లు 9 శాతానికి పైగా ఉండగా, గొల్లలు 7 శాతానికి పైగానే ఉన్నారు. లంబాడాలు 4 శాతం, రెడ్డి 3 శాతం మేర ఉన్నారు. మున్నూరు కాపులు రెండున్నర శాతం ఇతరులు 16 శాతానికి పైగా ఉన్నారు.