Home Page SliderTelangana

దుబ్బాకలో పైచేయి సెంటిమెంట్‌దేనా?

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నియోజకవర్గం రూటే సెపరేట్.. ఇక్కడ సెంటిమెంట్ తో ఎన్నికలొస్తే అందుకు భిన్నంగా ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి తర్వాత సెంటిమెంట్‌కు పట్టం కడతారా లేదంటే ముందస్తు లెక్కల ప్రకారం వేస్తారో చూడాలి. సెంటిమెంట్ పట్టించుకోకుండా తీర్పివ్వడంలో ఈ నియోజకవర్గ ఓటర్లు ఘనత వహించారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ్నుంచి రఘునంద్ రావు విజయం సాధించగా, ఆయన మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో ఇక్కడ్నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావు పట్టుబట్టి తిరిగి పోయిన చోటే గెలుచుకోవాలన్న సూత్రంతో ఇక్కడ విజేతగా నిలిచారు. ఈసారి ఇక్కడ్నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఇక ఇక్కడ్నుంచి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ పనిగా బీఆర్ఎస్ ఆరోపించింది. ఈసారి మెదక్ ఎన్నికలో సెంటిమెంట్ పనిచేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌బూత్‌లు 253. పురుష ఓటర్లు 95,305 ఉన్నారు. మహిళా ఓటర్లు 99,359 మంది కాగా ఈ నియోజకవర్గంలో ట్రాన్స్ జెండర్లు ఎవరూ కూడా ఓటు నమోదు చేసుకోలేదు. ఇక మొత్తం ఓటర్లు 1,94,664 ఉన్నారు. దుబ్బాకలోనూ ముదిరాజ్ ఓటర్లు 15 శాతానికి చేరువగా ఉన్నారు. మాల, మాదిగ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. గొల్లలు ఇక్కడ 12 శాతానికి దగ్గరగా ఉన్నారు. గౌడలు సైతం 10 శాతం వరకు ఉన్నారు. మాదిగలు 11 శాతం ఉండగా, మాలలు సైతం 9 శాతానికి చేరవలో ఉన్నారు. పద్మశాలీలు ఇక్కడ 7 శాతానికి పైగా ఉన్నారు. వైశ్యలు 6 శాతానికి పైగానే ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం 6 శాతానికి చేరువగా ఉండగా, ముస్లింలు ఐదున్నర శాతం, మున్నూరు కాపులు మూడున్నర శాతానికి చేరువగా ఉండగా ఇతర అన్ని కులాలు కలిపి 16 శాతం వరకు ఉన్నారు.