National

కేరళ నరబలి కేసులో మిస్టరీ ఛేదించిన తెలుగు కమీషనర్

కేరళలో జరిగిన అత్యంత హేయమైన నరబలి కేసును ఛేదించడానికి ఒక తెలుగు పోలీస్ అధికారి కీలకంగా వ్యవహరించారు. ఈయన నల్గొండ జిల్లాకు చెందిన కేరళ క్యాడర్ అధికారి. కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 57 ప్రకారం వ్యక్తులు మిస్సింగ్ కేసు నమోదయితే అది తేలేవరకూ దర్యాప్తు కొనసాగించాలని నిబంధన ఉంది. దీనివల్లే ఈ జంట మహిళల కేసు వెలుగులోకి వచ్చింది. కొచ్చి కమిషనర్ సీ.హెచ్. నాగరాజు  ఐజీ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఎంతో ఓర్పుతో ఒక్కొక్క ఆధారాన్ని తెలుసుకుంటూ ఈ కేసు మిస్టరీని కనిపెట్టారు. ఈ కేసులో ఘోర అత్యాచారం, హత్యలకు పాల్పడ్డ షఫీ అంత తేలిగ్గా పోలీసులకు దొరకలేదు.

కొచ్చికి చెందిన పద్మ మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె స్కార్పియో వాహనంలో ఎక్కుతూ కనిపించింది. ఎంతో ప్రయత్నం చేసి ఆవాహనాన్ని పట్టుకోగా, దానిద్వారా షఫీ దొరికాడు. అతనిని విచారించగా పద్మను కారులో ఎక్కించుకున్నానని, ఆమెను ఒక ప్రాంతంలో వదిలేసానని, తనకేమీ తెలియదని కట్టుకథలు చెప్పాడు. ఆఖరుకు షఫీ సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ పరిశీలించగా, పద్మ తప్పిపోయిన రోజు రాత్రి షఫీ ఫోన్ ఎలంతూర్ ఊరి చివర్న రాత్రంతా ఉన్నట్లు తెలిసింది. టవర్ లొకేషన్ ఆధారంగానే భగవల్ సింగ్, లైలాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీనితో మొత్తం కథ బయటపడింది.

షఫీ ఆరో తరగతి కూడా పూర్తిచేయకుండానే, 17 ఏళ్ల వయస్సులో ఇంట్లోనుంచి పారిపోయాడు. రకరకాల లేబర్ పనులు చేసి, చివరకు ఎర్నాకులంలో సెటిలయ్యాడు. ఫేస్ బుక్‌లో ఫేక్ ఎకౌంట్స్ తెరిచి ప్రజల కష్టాలు పోగొడతానంటూ పోస్టులు పెట్టాడు. ఈ లైలా దంపతులకు కూడా ఫేస్‌బుక్ ద్వారానే శ్రీదేవి పేరుతో పరిచయం అయ్యాడు. వీరిద్దరూ షఫీని గుడ్డిగా నమ్మేశారు. మీ పరిస్థితులు బాగుపడతాయి, శాంతి జరుగుతుందని తన భార్యను, తన సొంత చెల్లెల్ని కూడా షఫీతో శృంగారానికి అంగీకరించాడు భగవల్ సింగ్. అతని కళ్ల ఎదుటే వారిని అత్యాచారం చేశాడు షఫీ.

పద్మను డబ్బు ఆశ చూపించి, భగవల్ ఇంటికి తీసుకువచ్చాడు. వైరును ఆమె మెడకు బిగించి హత్య చేసి, అనంతరం లైలాతో గొంతు, ఇతర శరీరభాగాలను కోయించి, ఇంటి చుట్టూ పాతించాడు. ఈ ఘటన తెలుసుకున్న కమిషనర్ నాగరాజు ఇంతకు ముందు కూడా ఇలాంటి నేరాలు చేసి ఉంటాడని భావించి మరోమారు షఫీని విచారించగా రోజిలిన్ కథ కూడా బయటపడింది. ఆమెని ఈ ఏడాది జూన్‌లో తీసుకొచ్చి, నీలిచిత్రాల చిత్రీకరణ పేరుతో చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను కూడా లైలా చేతనే గొంతు కోయించి, శరీరభాగాలు ముక్కలు చేసి భూమిలో పాతించాడు. ఇలాంటి నరరూప రాక్షసుడికి కఠిన శిక్ష పడాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.