మల్కాజ్‌గిరిలో గెలుపు ఎవరి సొంతం!?
నగరం నడిబొడ్డున ఉన్న నియోజకవర్గంగా మల్కాజ్ గిరి మారిపోయింది. గతంలో సిటీకి ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే ఈ ప్రాంతం హైదరాబాద్ అభివృద్ధితోపాటుగా వేగంగా పెరిగిపోయింది. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఈసారి రాజకీయంగా పెను తుపాన్ రేగుతోంది. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో మల్కాజ్‌గిరి, సఫిల్ గూడ, మౌలాలి, వినాయక్ నగర్, కాకతీయ నగర్, ఈస్ట్ ఆనంద్ బాగ్, గౌతమ్ నగర్, నేరేడ్ మెట్, సైనిక్ పురి, ఆల్వాల్, యాప్రాల్, మచ్చబొల్లారం మండలాలున్నాయి. ఇక్కడ స్థానిక ఓటర్లతోపాటుగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినవారు, ఆంధ్రా ప్రాంత వాసులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరందరూ ఎన్నికల్లో విజేతపై ప్రభావం చూపెడతారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో బీజేపీకి గట్టి పట్టున్నప్పటికీ గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచి మైనంపల్లి హన్మంతరావు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సొంత పార్టీ బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. తండ్రీ, కొడుకులకు బీఆర్ఎస్ పార్టీలో సీటు లభించకపోవడంతో ఆయన హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ్నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లి పోటీ చేస్తోండగా, బీజేపీ నుంచి ఎన్ రామచందర్ రావు, బీఆర్ఎస్ నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిబరిలో నిలుస్తున్నారు. 2009లో అక్కడ్నుంచి విజయం సాధించిన ఆకుల రాజేందర్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నగరానికి కూతవేటుదూరంలో ఉన్న ఇక్కడ ఆంధ్రా ప్రాంత ఓటర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారు.

మల్కాజ్ గిరి నియోజకవర్గంలో 411 పోలింగ్ బూత్‌లు ఉండగా, 4లక్షల 46 వేల 822 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 2,36,804, స్త్రీలు 2,32,009 మంది ఉండగా, ట్రాన్స్‌జెండర్లు 9 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా బరిలో దిగిన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని ఈసారి అసెంబ్లీ బరిలో నిలిపింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ్నుంచి గెలుపు నల్లేరుపై నడకన్న భావనలో కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఉన్నారు. తెలంగాణ నియోజకవర్గాలన్నింటిలోనూ విలక్షణమైనది మల్కాజ్‌గిరి అని చెప్పొచ్చు. ఇక్కడ్నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనమంతరావు కారు పార్టీకి గుడ్‌బై చెప్పి హస్తం పార్టీలో చేరారు. ఆయన తనయుడు రోహిత్ మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడం, మెదక్ ప్రాంతం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న మల్కాజ్‌గిరిలో ఈసారి విజయంపై మైనంపల్లి దీమాగా ఉన్నారు. తన కుటుంబం చేస్తున్న సామాజిక కార్యక్రమాలతో గెలుపు తనదేనన్న దీమాలో ఆయన కన్పిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ బ్రహ్మణలు 10 శాతం వరకు ఉన్నారు. యాదవులు, గౌడలు 10 శాతం వరకు ఉన్నారు. కాపులు, మున్నురు కాపులు, తూర్పు కాపులు 10 శాతం ఉన్నారు. ఎస్సీలు 6 శాతం, రెడ్డిలు 6 శాతం, ముదిరాజ్‌లు 6 శాతానికి పైగా ఉండగా, ముస్లింలు 6 శాతం వరకు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వడ్డెరలు 4 శాతం ఉండగా, ఎస్టీలు 4 శాతం, క్రిస్టియన్లు 4 శాతం ఉన్నారు. పద్మశాలీలు సైతం 3 శాతం ఉండగా ఇతరులు 21 ఉన్నారు.