చంద్రబాబును తప్పుదోవ పట్టించిందెవరు…?
పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక ప్రభావవంతమైన టీడీపీ నేత చంద్రబాబుకు దగ్గరగా ఉండి జయచంద్రారెడ్డికి టిక్కెట్ రావడానికి కీలక పాత్ర పోషించారు . అంతేకాదు, మరో కీలక నేత ద్వారా నారా లోకేష్ వద్ద కూడా సిఫార్సు వెళ్లిందని అంటున్నారు. అందుకే చివరి నిమిషం వరకు నిలిపివేసిన బీఫారం చివరికి చంద్రబాబు ఇచ్చారని సమాచారం .
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిర్ణయాలు తీసుకునే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారని పార్టీ వర్గాలందరికీ తెలిసిందే.ఎవరినైనా పార్టీలోకి చేర్చుకునే ముందు వారి రాజకీయ ప్రస్థానం, వ్యక్తిగత ప్రవర్తన, ప్రజాభిప్రాయం, ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ పరిశీలించి కండువా కప్పడం ఆయనకు మామూలే. ముఖ్యంగా ఎన్నికల సమయం వస్తే అభ్యర్థుల ఎంపికలో మాత్రం చంద్రబాబు అత్యంత శ్రద్ధతో వ్యవహరిస్తారు.
అయితే, ఈ సారి తంబళ్లపల్లి టీడీపీ నేత జయచంద్రారెడ్డి విషయంలో మాత్రం చంద్రబాబును ఎవరు తప్పుదోవ పట్టించారన్న ప్రశ్న ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే, నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉండటం టీడీపీకి ఇబ్బందిగా మారింది.
తంబళ్లపల్లి అంటే చిత్తూరు జిల్లా, అదే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. 1999 ఎన్నికల నుంచే అభ్యర్థుల ఎంపికలో ఆయన జాగ్రత్తగా ఉంటూ అన్ని కోణాల్లో నివేదికలు సేకరించి నిర్ణయాలు తీసుకునేవారు. అయితే ఈసారి మాత్రం ఆ వ్యవస్థలో ఎక్కడో పొరపాటు జరిగినట్లు కనిపిస్తోంది.జయచంద్రారెడ్డి ఆర్థిక బలం, ప్రభావం ఆధారంగా టిక్కెట్ ఇచ్చారా? లేక ఎవరైనా సిఫార్సుతో ఆయనకు బీఫారం ఇచ్చారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో తారస్థాయికి చేరాయి.జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉన్నారని, గతంలో వారితో విభేదించి బయటకు రారని అక్కడి స్థానిక నేతలు చెబుతున్నారు. అందువల్ల ఆయనకు టిక్కెట్ ఇవ్వడం సరైన నిర్ణయమేనా, అనే అనుమానం కూడా టీడీపీలో వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు పార్టీలో చేరిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం పాత నాయకులకు అసంతృప్తిని కలిగించిందని సమాచారం.
ఇప్పుడు నకిలీ మద్యం కేసు కూటమి ప్రభుత్వానికి మచ్చగా మారింది. వైసీపీ నేతలు దీన్ని రాజకీయంగా ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మనిషి అని టీడీపీ వర్గాలు చెప్పినా, ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఆయన్ని కండువా కప్పింది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లాలోనే, అది కూడా తన ప్రధాన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ ప్రభావం ఉన్న తంబళ్లపల్లిలో ఇలాంటి తప్పిదం జరిగిందన్నది పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. మొత్తం మీద, తంబళ్లపల్లి వ్యవహారం టీడీపీలో మానసిక ఒత్తిడికి కారణమవుతోందని, భవిష్యత్తులో పార్టీ వ్యూహాలు ఎలా మారతాయన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.