NationalNews

కేసీఆర్‌ జాతీయ పార్టీకి స్ఫూర్తి ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయ దశమి రోజున భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. తెలంగాణాకే పరిమితమైన పార్టీ కాస్త.. జాతీయ పార్టీగా అవతరించింది. చాణక్య నీతితో రాష్ట్రంలో ప్రత్యర్థులను చిత్తు చేసిన కేసీఆర్‌ ఇక దేశంలో సైతం చక్రం తిప్పేందుకు సన్నద్ధమయ్యారు. తాను ఇక తెలంగాణ నాయకుడిని కాదని.. ‘దేశ్‌ కీ నేత’ అని చాటుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ సీఎంగా ఎదురులేని పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు దేశ రాజకీయాల్లో అడుగు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చినట్లు..? ఆయనకు స్ఫూర్తి ఎవరు..?

ఒవైసీ దూకుడును చూసి..

కేసీఆర్‌కు ప్రధానంగా ఇద్దరు స్ఫూర్తిగా నిలిచారు. ఒకరు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. తెలంగాణాలోని ఒక చిన్న ప్రాంతమైన హైదరాబాద్‌లోని పాత బస్తీకే పరిమితిమైన పార్టీని ఒవైసీ ఈ ఐదేళ్లలో జాతీయ స్థాయికి విస్తరించగలిగారు. బీజేపీ హిందూ రాజకీయాలకు పోటీగా మజ్లిస్‌ ముస్లిం రాజకీయాన్ని భుజాన ఎత్తుకొని.. ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట పాగా వేసేందుకు పావులు కదిపారు. ఈ క్రమంలో తెలంగాణాలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో సహా మహారాష్ట్రలో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, బిహార్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమిని, ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీని, బిహార్‌లో ఆర్‌జేడీ-కాంగ్రెస్‌ కూటమిని, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా మజ్లిస్‌ పార్టీ ఓట్లను చీల్చిందని.. బీజేపీకి లబ్ధి చేకూర్చిందని విమర్శలు సైతం వచ్చాయి. అయినా వెనకడుగు వేయని ఒవైసీ.. దూకుడుగా ముందుకెళ్తూ.. తన పార్టీ విస్తరణే లక్ష్యంగా గుజరాత్‌ సహా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పోటీకి సై అంటున్నారు.

రెండో రాష్ట్రాన్ని సాధించిన కేజ్రీవాల్‌..

కేసీఆర్‌కు స్ఫూర్తిగా నిలిచిన మరొక వ్యక్తి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ కూడా ఢిల్లీ నుంచి క్రమంగా తన పార్టీని విస్తరిస్తున్నారు. బీజేపీపై పోరాటం అంటూ ఏకంగా పంజాబ్‌ రాష్ట్రాన్నే కైవసం చేసుకున్నారు. ఇప్పుడు గుజరాత్‌లోనూ బీజేపీకి గట్టి పోటీదారుగా నిలిచి ప్రధాని మోదీకి కొరకరాని కొయ్యగా మారారు. హర్యానా, యూపీ, రాజస్థాన్‌ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తన పార్టీని క్రమంగా విస్తరిస్తూ.. బీజేపీకి మింగుడు పడని స్థితికి చేరుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలపై కేంద్ర ప్రభుత్వం ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు చేసినా వెరవకుండా బీజేపీతో తాడో పేడో తేల్చుకుంటానంటున్నారు. ఈ ఇద్దరి స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సీఎం కేసీఆర్‌ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై, తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. ఒవైసీ ముస్లిం ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకొని ముందుకెళ్తే.. కేసీఆర్‌ ఎస్టీ, ఎస్టీల ఓటు బ్యాంకును అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నారు.