ఉమ్మడి ఆదిలాబాద్ బాస్ ఎవరు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి దోబూచులాడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో మరోసారి ఈ పదవి ఎవరికి దక్కనుందోనన్న ఉత్కంఠ రేకెత్తింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడంతో ఈసారి తప్పకుండా అవకాశం రానుందనే అంచనా వేస్తున్నారు. పది శాసనసభ స్థానాల్లో ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ గెలించింది. తొలి మంత్రివర్గ విస్తరణలో మంత్రి జిల్లాకు అవకాశం వస్తుందన్న ఆశ నీరుగారింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి పదవి వస్తుందనుకున్నప్పటికీ రెండో దశ విస్తరణ జరగలేదు.తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిల్లీకి వెళ్లటం, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే సంకేతాలు వెలువడటం ఆశావాహులతో పాటు జిల్లా పార్టీ శ్రేణులను ఉత్కంఠకు గురి చేస్తోంది. దీంతో వివేక్, ప్రేమ్‌సాగర్‌రావుల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది.