బీజేపీలో చేరే ఆ కీలక నేత ఎవరు?
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీలోకి వలసల జోరు పెరిగింది. ఈ నెల 21వ తేదీన మునుగోడులో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు కంది లక్ష్మారెడ్డిలకు ఈటల రాజేందర్ ఇటీవల కాషాయ కండువా కప్పారు. నిజానికి వీళ్లంతా అమిత్ షా సమక్షంలోనే బీజేపీలో చేరాలనుకున్నారు. కానీ తాడూరి వెంకట్‌రెడ్డి ఇంటికి పోలీసులు అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో వీళ్లంతా ఈటల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందుకు ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్, కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు రంగం సిద్ధం చేసుకున్నారు.

మరోవైపు.. అమిత్ షా సమక్షంలో ఒక కీలక నేత బీజేపీలో చేరతారంటూ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కీలక నేత ఎవరా.. అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.