సుప్రీం తీర్పు ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధానా.. మూడు రాజధానుల అనే అంశంపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ఆరు నెలల్లో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంతో పాటు నెలలోపు భూ సమీకరణ రైతులకు ఇచ్చే ప్రత్యామ్నాయ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలని రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ ఈ సంవత్సరం మార్చి మూడో తేదీన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం 307 పేజీల చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై అఫిడవిట్ దాఖలు చేస్తూనే మరోవైపు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బివీ నాగరత్న విచారణ జరిపి ప్రభుత్వ ఎస్ఎల్పీ లోని ఏడు అంశాలకు గాను ఐదింటిపై స్టే విధించడం ప్రభుత్వానికి ఊరట నిచ్చే అంశంగా చూడాలి.

మరోవైపు రాజధానిపై రైతుల వాదనలు కూడా విని తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం ప్రకటించడంతో ఒకింత సస్పెన్స్ నెలకొంది. సుప్రీం తీర్పును అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం విశేషం. అలానే విచారణ సందర్భంగా హైకోర్టును ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ అసహనం వ్యక్తం చేయడంతో భవిష్యత్తులో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కానీ రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాదని అది పార్లమెంట్లో ఆమోదించిన తర్వాతే నిర్ణయించాల్సి ఉంటుందని హైకోర్టు తీర్పును స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీం డివిజన్ బెంచ్ దీనిపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పు ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధమంది. అదే సమయంలో ప్రభుత్వం తరఫున న్యాయవాదుల వాదనలతో ఏకీభవించింది. ఓ నిర్దిష్ట పద్ధతిలో చట్టాన్ని ఆమోదించమని శాసనసభను హైకోర్టు ఆదేశించలేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

కేబినెట్ తీసుకునే నిర్ణయాలను హైకోర్టు ఎలా అన్వయించుకుంటుందని భావన వ్యక్తపరచింది. శాసన వ్యవస్థ విధి విధానాల్లో చట్ట వ్యతిరేకమైనప్పుడు తప్పితే కోర్టుల జోక్యం తగదని స్పష్టం చేసింది. దీనితో మూడు రాజధానులపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుందేమోనని సర్కారు భావిస్తోంది. అంటే ప్రభుత్వం మళ్లీ శాసనసభను సమావేశపరచి మూడు రాజధానులు బిల్లును ఆమోదించి చట్టబద్ధత కల్పించే వీలు కలిగింది. దీంతో కొన్ని రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను విశాఖ కేంద్రంగా సాగిస్తుందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. రైతుల తరఫున వాదనలను వచ్చే జనవరి 31వ తేదీకి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసిన నేపథ్యంలో ప్రభుత్వం 3 రాజధానుల అంశంపై ఏ మేరకు ముందుకు వెళ్తుందో చూడాలి.