షర్మిల కారులో కూర్చొని ఉండగానే.. క్రేన్‌తో కారును లాక్కెళ్లిన పోలీసులు
ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న వైఎస్ షర్మిలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పంజాగుట్ట చౌరాస్తా వద్ద షర్మిల కారును పోలీసులు అటకాయించారు. షర్మిల డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సమయంలోనే కారును క్రేన్‌తో తరలించారు. ధ్వంసమైన కారులో షర్మిల కూర్చున్న సమయంలోనే పోలీసులు క్రేన్ ద్వారా ఆమెను ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై షర్మిల పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వైఎస్సార్టీపీ మద్దతుదారులకు, అధికార టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వరంగల్‌లో ఘర్షణతో గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న షర్మిల బస ఉంటే బస్సును ధ్వంసం చేయడంతోపాటు, ఆమె కారు అద్దాలను పగులగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు షర్మిలను హైదరాబాద్ తీసుకొచ్చారు. నిన్న వరంగల్‌లోని నర్సంపేటలో షర్మిల మాట్లాడుతూ స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల క్యారీ వాన్‌తోపాటు, ఆమె వాహనంపై దాడి చేశారు. వైఎస్సార్టీపీ కార్యకర్తలపై బాహాబాహీకి దిగారు. ఘర్షణ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు పాదయాత్రకు అనుమతిని తాత్కాలికంగా రద్దు చేసి షర్మిలను పోలీసు ఎస్కార్ట్‌తో హైదరాబాద్‌కు తరలించారు. షర్మిలను అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు.

గత 223 రోజులుగా నేను, నా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే.. టీఆర్ఎస్ పార్టీ చూడలేకపోతోందన్నారు షర్మిల. వైఎస్సార్టీపీ పార్టీకి పెరుగుతున్న ఆదరణతో పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి, పార్టీ నేతలను చూస్తున్నారన్నారు. ఇప్పటి వరకు దాదాపు 3,500 కిలోమీటర్ల మేర సాగిన షర్మిల పాదయాత్రలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.

