ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట పత్రికా స్వేచ్ఛ లేదు
దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట పత్రికా స్వేచ్ఛ లేదని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( IFWJ) 74వ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం నాడిక్కడ జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఈటల మాట్లాడుతూ.. తెలంగాణాలోనూ మీడియాను అధికార పార్టీ నియంత్రిస్తోందని ఆరోపించారు. మెజారిటీ పత్రికల్లో ప్రజా సమస్యల ప్రస్తావనే లేదని.. అధికార పార్టీకి బాకా ఊదుతున్నాయని విమర్శించారు. మీడియా తమకు అండగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

షోయబుల్లా ఖాన్ వారసులుగా పనిచేయాలి..
నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు షోయబుల్లా ఖాన్‌ను హత్య చేశారని గుర్తు చేసిన ఈటల.. జర్నలిస్టులంతా షోయబుల్లా ఖాన్ వారసులుగా ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని సూచించారు. చాలా మంది జర్నలిస్టులకు కడుపునిండా తినడానికి తిండి లేదని.. కుటుంబాలను పోషించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇస్తానన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం సగం మందికి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని.. వారికి అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేట్లు హెల్త్‌కార్డులు ఇవ్వాలని.. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

