ఆ పులి కూనల మమ్మీ ఎక్కడ?
అడవిలో దారి తప్పిపోయిన నాలుగు పులి కూనలు ఊరిలోకి వచ్చాయి. తల్లి కానరాక అయోమయానికి గురయ్యాయి. ఈ సంఘటన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామంలో జరిగింది. సోమవారం ఈ ఊరిలో నాలుగు పులి కూనలు కనిపించాయి. అటవీ అధికారులు ఈ పిల్లలకు పాలు పట్టించి, అడవికి దగ్గరలోని అటవీశాఖ కార్యాలయంలో ఉంచారు. వాటి తల్లి వస్తే వాటిని అప్పగించి అడవిలో విడిచిపెట్టాలనే ఆలోచనతో సోమవారం రాత్రి అక్కడే ఉంచారు.

వాటి తల్లిని టీ-108 అనే పులిగా గుర్తించారు. పులి జాడను మాత్రం ఇంకా గుర్తించలేదు. తల్లిపులిని వెతికే ప్రయత్నంలో సోమవారం, మంగళవారం పెద్దగుమ్మడాపురం పరిసర అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. రెండు కిలోమీటర్ల పరిధిలోని అటవీప్రాంతాన్ని 100 ఇన్‌ప్రారెడ్ కెమెరాలతో గాలించారు. డ్రోన్ కెమెరా సహాయంతో కూడా వెతకాలని భావిస్తున్నారు. పశువైద్యుల పర్యవేక్షణలో ఆ పులి కూనలను ఉంచారు. వాటికి అవసరమైన వైద్యపరీక్షలు కూడా చేయించారు. అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు పులి పిల్లలను తిరుపతి జూపార్క్‌లోని పశువైద్యులకు అప్పగించారు.

