మునుగోడు ఓటరు నాడి ఎటు..?
ఓ చిన్నపాటి యుద్ధంలా సాగిన మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడింది. ఇక 3వ తేదీన ఈవీఎంలో ఓటరు నిక్షిప్తం చేసే ఓటుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇన్ని కోట్లు ఖర్చు చేసి.. ఇంత బలగాన్ని మోహరించి ఆకాశం దద్దరిల్లేలా హోరుగా ప్రచారం చేసినా ఓటరు నాడి తెలియడం లేదంటూ అన్ని రాజకీయ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ప్రచారం సందర్భంగా ప్రధాన పార్టీలు నిర్వహించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటూ అన్ని పార్టీలకూ జై కొట్టిన మునుగోడు ప్రజల మనస్సులో ఏముందో తెలియక అంతర్మధనంలో పడ్డాయి. ఓటు కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి తమ ప్రాంతానికి ఏం కావాలో చెబుతూ అభ్యర్థుల నుంచి హామీలు తీసుకున్నారు. దీంతో అందరూ తమకే ఓటు పడుతుందన్న ఆశతో వెళ్లిపోయారు. చివరికి ఏ పార్టీ కొంప ముంచుతారో అని అన్ని పార్టీలూ భయపడుతున్నాయి.

జాతీయ పార్టీకి పునాదిరాయి..
టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. జాతీయ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ పరువు నిలవాలంటే ఇక్కడ తప్పనిసరిగా గెలవాల్సిందే. అప్పుడే ఇతర రాష్ట్రాల్లోని నాయకులకు కేసీఆర్పై నమ్మకం కలుగుతుంది. అంతేకాదు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల నమ్మకం గెలవాలంటే ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం తప్పనిసరి. అందుకే చాలా సీరియస్గా తీసుకున్న టీఆర్ఎస్ ప్రతి ఊరి బాధ్యతను ఒక ఎమ్మెల్యేకు అప్పగించింది. రాష్ట్ర మంత్రులంతా నెల రోజులుగా మునుగోడులోనే మకాం వేశారు. సీఎం కేసీఆర్ సైతం రెండుసార్లు బహిరంగ సభలు నిర్వహించి మునుగోడు ప్రజల హృదయాలు గెలిచేందుకు తాపత్రయపడ్డారు. ఇంత చేసినా మునుగోడు ప్రజలు తమకు ఓటేస్తారా..? అని తర్జన భర్జన పడుతున్నారు.

రాజగోపాల్ రెడ్డికి ప్రతిష్టాత్మకం..
రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సాధించాలనుకుంటున్న బీజేపీకి మునుగోడు ఉప ఎన్నిక గేట్ వే గా మారింది. భవిష్యత్తు దృష్ట్యా కాషాయ పార్టీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇది సిట్టింగ్ స్థానం కావడం కలిసొచ్చే అంశం. జాతీయ స్థాయి బీజేపీ నేతలు సైతం ప్రచారంలో పాల్గొనడంతో ఇక్కడి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కమలం గుర్తును ప్రముఖంగా ప్రచారం చేస్తూ ఇంతకాలం కాంగ్రెస్ పక్షం నిలబడిన ఓటర్లను కూడా బీజేపీ వైపు తిప్పేందుకు చాలా కష్టపడ్డారు. తన వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని.. అందుకే మునుగోడులో అభివృద్ధి జరుగుతోందన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవితవ్యానికి కూడా ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.

వెనుకబడిన కాంగ్రెస్..
కాంగ్రెస్కు పెట్టని కోట అయిన మునుగోడులో ఆ పార్టీ ఈ సారి వెనుకబడింది. ముఖ్యంగా పార్టీలోని అంతర్గత కలహాలు ఆ పార్టీకి శాపంగా దాపురించారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయకపోవడం.. రాజగోపాల్ రెడ్డికి ఓట్లేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరిన వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. పార్టీ సీనియర్ నాయకుల మధ్య సమన్వయం కొరవడటం.. తదితర కారణాలు ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టాయి. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా సేవలందించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గుర్తింపు పైనే ఆమె కుమార్తె, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆధారపడ్డారు. మునుగోడులో గెలిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. మొత్తానికి ఓటరు గుంభనం పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.